ష‌కీల్‌తో పాటు 15 మంది జంప్… అమిత్‌షాకు చేరిన లిస్ట్ !

తెలంగాణలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌తో ఇప్ప‌టికే టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి రాజుకుంది. నేత‌ల్లో అసంతృప్తి అలా త‌యారైందో లేదో బీజేపీ దాన్ని పెంచి పెద్ద‌ది చేసే ప‌ని చేప‌ట్టింది. ఇప్ప‌టికే అసంతృప్తిపై సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది.

టీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా బీజేపీ స‌వాళ్లు విసురుతోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను నిజామాబాద్ జిల్లా నుంచి ప్రారంభించింది. బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌కు బీజేపీ ఇప్ప‌టికే ఆఫ‌ర్ ఇచ్చింది. ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ కావ‌డం….ఆఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారాయి. ష‌కీల్ పార్టీ మారే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న మాత్రం సోమ‌వారం అన్ని విషయాలు చెబుతాన‌ని చెప్పారు.

ష‌కీల్‌తో పాటు 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ వ‌ల వేస్తోంది. ఇప్ప‌టికే 15 మంది లిస్ట్ జాతీయ‌ అధ్య‌క్షుడు అమిత్ షా ద‌గ్గ‌ర‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల‌తో పాటు కీల‌క నేతలతో కూడా కొంద‌రు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ట‌చ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ష‌కీల్‌తో మొద‌లైన ఈ ఝ‌ల‌క్ రాబోయే రోజుల్లో కంటిన్యూ చేయాల‌ని కాషాయ‌ద‌ళం ఆలోచిస్తోంది. 15 మంది నేత‌ల చేరిక‌ల‌పై త్వ‌ర‌లోనే అమిత్ షా క్లారిటీ ఇస్తే..భారీగా చేరిక‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు ష‌కీల్ ఎపిసోడ్ తో గులాబీ ద‌ళంలో క‌ల‌వరం మొద‌లైంది. ష‌కీల్‌ను బుజ్జ‌గించేందుకు నిజామాబాద్ కీల‌క నేత‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇటు అధిష్టానం నుంచి ఒక‌రిద్ద‌రు నేత‌లు ఆయ‌న‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం వ‌ర‌కు ష‌కీల్ డెడ్‌లైన్ పెట్టారు. ఈ లోపు ఆయ‌న డిమాండ్ల‌ను నెర‌వేర్చే ప‌ని చేప‌ట్టాలని గులాబీ నేత‌లు అనుకుంటున్నారు.

ఇటు టీఆర్ఎస్‌లో కేసులు, ఆర్ధికంగా చితికిన నేత‌లే టార్గెట్‌గా బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలకు పదును పెడుతోంది. మ‌నుషుల అక్ర‌మ ర‌వాణా కేసులో ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ష‌కీల్‌పై రెండు కేసులు న‌మోద‌య్యాయి. వీటితో పాటు చీటింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుల బూచితోనే షకీల్‌ను బెదిరించార‌ని..దీంతో ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని గులాబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ష‌కీల్ కేసుల‌తో టీఆర్ఎస్‌లోని కీల‌క నేత‌ల‌కు సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌కు మేలు చేయ‌క‌పోతే మీడియా స‌మావేశంలో వారి పేర్లు బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఆయ‌న బెదిరిస్తున్నార‌ట‌.

మొత్తానికి గులాబీ తోట‌లో తేనెతెట్టెను క‌దిపించే ప‌ని బీజేపీ చేప‌ట్టింది. రాబోయే రోజుల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.