చిన్నారి లేఖపై జగన్‌ స్పందన… తక్షణం గ్రామానికి వెళ్లాలని కలెక్టర్‌కు ఆదేశం

ప్రకాశం జిల్లా రామచంద్రాపురంలో కుల కట్టుబాటు పేరుతో గ్రామపెద్దలు తమ కుటుంబాన్ని వెలివేశారంటూ ఒక చిన్నారి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డికి నేరుగా లేఖ రాసింది.

తమను గ్రామస్తులు వెలివేశారని… ఎవరూ మాట్లాడడం లేదని, కనీసం తనతో, తన తమ్ముడితో ఆడుకునేందుకు కూడా ఎవరూ రావడం లేదంటూ ఆవేదనతో నాలుగవ తరగతి చదువుతున్న చిన్నారి పుష్ఫ సీఎంకు లేఖ రాసింది.

తమతో ఎవరైనా మాట్లాడితే 10వేల జరిమానా వేస్తామని తమ కుల పెద్దలు హెచ్చరించారని లేఖలో వివరించింది. ఈ లేఖ సీఎంకు చేరింది. దాంతో తక్షణం ఆయన స్పందించారు. లేఖను ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు పంపించారు. వెంటనే గ్రామానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. కుటుంబాన్ని వెలివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామానికి చెందిన కొడూరు వెంకటేశ్వరరావుకు, కుల పెద్దలకు మధ్య ఇటీవల ఒక భూమి విషయంలో వివాదం వచ్చింది. దాంతో కుల పెద్దలు ఏకమై వెంకటేశ్వరరావు కుటుంబాన్ని వెలివేశారు. పిల్లలను స్కూల్‌లోకి రానివ్వలేదు.

విషయం తెలుసుకున్న అధికారులు పిల్లలను తిరిగి స్కూల్‌కు రప్పించగలిగారు గానీ ఆ పిల్లలతో మిగిలిన పిల్లలు మాట్లాడకుండా కులపెద్దలు అడ్డుకున్నారు. ఈనేపథ్యంలోనే చిన్నారి సీఎంకు లేఖ రాసింది. ఆయన స్పందించి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.