దేశంపై హిందీ రుద్దే చర్యలకు అమిత్ షా శ్రీకారం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు మండిపడుతున్నారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కామన్ లాంగ్వేజ్ అవసరమని… అలా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం ఒక్క హిందీకి మాత్రమే ఉందంటూ వ్యాఖ్యానించారు.

హిందీ దివాస్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా దేశంలోని అన్ని రాష్ట్రాల వారు తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలన్న సందేశాన్ని అమిత్ షా ఇచ్చారు.

యావత్ భారతదేశానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. దేశంలో హిందీ వాడకాన్ని పెంచాలని అభిప్రాయపడ్డారు.

అమిత్ షా ట్వీట్‌పై ప్రాంతీయ పార్టీలు మండిపడుతున్నాయి. హిందీని దేశంపై బలవంతంగా రుద్దేందుకు, ఉత్తరాది ఆధిపత్యాన్ని దేశమంతా చెలాయించే కుట్ర ఇందులో ఉందని అభిప్రాయపడుతున్నారు.

షా వ్యాఖ్యలను తమిళనాడుకు చెందిన ఎంపీ వైకో ఖండించారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ సైతం ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తక్షణం అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. షా వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. తొలి నుంచి కూడా తాము హిందీని బలవంతంగా రుద్దే చర్యలపైనా, ఆధిపత్యం పైనా పోరాటం చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు.

దేశమంటే హిందీ, హిందుత్వం మాత్రమే కాదని… భారతదేశం హిందీ కంటే గొప్పదన్న విషయం అమిత్ షా గుర్తించాలని ఎంఐఎం అధినేత ఓవైసీ విమర్శించారు.