Telugu Global
International

మోడీకి అవార్డు ఇవ్వడంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌ పై ఆగ్రహం..!

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రముఖ ఎన్జీవో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం ప్రకంపనలు రేపుతోంది. దేశంలో మత రాజకీయాలు నెరుపుతున్న మోడీకి ఈ అవార్డు ఇవ్వడంపై గేట్స్ ఫౌండేషన్‌పై ప్రముఖ న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశంలో లక్షలాది టాయిలెట్లు నిర్మించి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించడంలో సఫలమైనందుకు మోడీకి ఈ అవార్డును ఇవ్వాలని బిల్‌గేట్స్ […]

మోడీకి అవార్డు ఇవ్వడంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌ పై ఆగ్రహం..!
X

భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రముఖ ఎన్జీవో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించడం ప్రకంపనలు రేపుతోంది. దేశంలో మత రాజకీయాలు నెరుపుతున్న మోడీకి ఈ అవార్డు ఇవ్వడంపై గేట్స్ ఫౌండేషన్‌పై ప్రముఖ న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా దేశంలో లక్షలాది టాయిలెట్లు నిర్మించి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించడంలో సఫలమైనందుకు మోడీకి ఈ అవార్డును ఇవ్వాలని బిల్‌గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించింది.

కశ్మీర్, అస్సాంలలో లక్షలాది మంది పౌరులను నిర్బంధించి, ఓటు హక్కును తీసేసి, ఇక్కడి నుంచి తరిమేస్తున్న పరిస్థితులున్న నేపథ్యంలో మోడీకి ఈ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా మీడియా కోడై కూస్తున్న వేళ ఈ అవార్డుకు మోడీ అర్హుడు కాదని వాళ్లు నినదిస్తున్నారు.

ఇక గత మంగళవారం గేట్స్ ఫౌండేషన్‌కు కొంత మంది దక్షిణాసియాకు చెందిన అమెరికన్లు లేఖ రాశారు. లక్షలాది మందిని తమ సామాజిక వర్గాల నుంచి వేరు చేసిన మోడీకి ప్రకటించిన అవార్డును వెనక్కు తీసుకోవాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం నెల క్రితం 80 లక్షల మంది కశ్మీరీలను గృహ నిర్భంధంలో ఉంచిందని.. అంతే కాకుండా సమాచార వ్యవస్థను ఆపేయడమే కాకుండా మీడియా కవరేజికి కూడా అనుమతులు ఇవ్వకుండా.. అసలు అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియనివ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్బంధంలో లక్షలాది మంది ప్రజలతో పాటు వేలాది మంది చిన్నారులు కూడా ఉన్నారని.. వీళ్లందరికీ కనీస సదుపాయాలు కూడా అందడం లేదని వారు అన్నారు. దీంతో పాటు ప్రతి నిత్యం శారీరిక హింసను ఎదుర్కుంటున్నారని.. దెబ్బలు తింటున్నారని అన్నారు. భారత భద్రతా దళాల దాడులతో ఒక చిన్నారి కూడా మృతి చెందాడని వారన్నారు.

మీరు ఈ అవార్డు ఇవ్వడం వల్ల అంతర్జాతీయ సమాజంలో కశ్మీర్ సమస్య మరుగున పడిపోతుందని.. అందరూ అక్కడ జరిగే మానవహక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడటం మానేస్తారని వారు పేర్కొన్నారు.

పోలిస్ ప్రాజెక్ట్…. అనే పరిశోధన, జర్నలిజం పోర్టల్ సహ వ్యవస్థాపకురాలు, న్యాయవాది అయిన సుచిత్ర విజయన్ మాట్లాడుతూ స్వచ్చంద సేవా సంస్థలు మోడీ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యాన్ని బయటపెట్టడంలో ముఖ్య పాత్రను పోషించాయన్నారు.

2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో వందలాది మంది ముస్లింల నరమేధానికి కారకుడయ్యాడని.. 2014లో ప్రధాని పీఠాన్ని ఎక్కే వరకు మోడీని అమెరికాకు రావడాన్ని నిషేధించారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన ఇండియా పెట్టుబడులకు స్వర్గధామం అని ఆమె అన్నారు.

మోడీ అధికారంలోకి వచ్చాక పలు ప్రభుత్వాలు, సంస్థలు ఆయనకు అవార్డులు ప్రకటించాయి. ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలకు కొత్త జీవం అందించినందుకు ఫిలిప్ కొట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఇచ్చింది. అలాగే సామాజిక, ఆర్థిక తారతమ్యాలను పేద, ధనిక వర్గాల మధ్య అంతరాన్ని రూపుమాపినందుకని సియోల్ శాంతి అవార్డు లభించింది. ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రపంచవ్యాప్తంగా పలు విమర్శలు కూడా వచ్చాయి.

గత ఏడాది ఐక్యరాజ్యసమితి మోడీకి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును కూడా ఇచ్చింది. కాగా దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య కారక నగరంగా ఆవిర్భవించడం.. వేలాది ఎకరాల్లో అడవులు నరికివేతకు గురవుతున్న సందర్భంగా ఈ అవార్డు ఇవ్వడమేంటనే విమర్శలు వచ్చాయి.

ఇక ఇప్పుడు కశ్మీర్, అస్సాం వివాదాల నేపథ్యంలో స్వచ్చ భారత్ పేరుతో మోడీకి అవార్డు ఇవ్వడంపై కూడా అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ లేఖపై గేట్స్, మిలిండా ఫౌండేషన్ కూడా స్పందించింది.

ఇండియాలో పారిశుథ్యాన్ని మెరుగుపరచడంలో మోడీ ప్రభుత్వం కృషి చేసిందని.. స్వచ్ఛ భారత్ వల్ల దేశంలో పారిశుథ్యం మెరుగుపడిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి కూడా పారిశుథ్యాన్ని ప్రాధాన్యతగా ఎంచుకుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అపరిశుభ్రత, బహిరంగ మలవిసర్జన కారణంగా గత ఐదేండ్లలో 5 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడ్డారని.. కాబట్టి పారిశుధ్యం ప్రాముఖ్యత ఎంతో అర్థమవుతోందని అన్నారు.

స్వచ్చభారత్ మిషన్‌కు పూర్వం దాదాపు 50 కోట్ల మందికి సరైన మరుగుదొడ్లు కూడా లేవన్నారు. మోడీ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకొని ప్రాధాన్యతగా ఎంచుకోవడం వల్ల దేశంలో పారిశుధ్యం మెరుగై వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించడం ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమం ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ పేర్కొంది. అందుకే మోడీకి ఈ అవార్డు ప్రకటించామని చెప్పింది.

First Published:  14 Sep 2019 1:41 AM GMT
Next Story