నన్నపనేని పై చర్యలు తీసుకోవాలి…. దళిత సంఘాలు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం, వైసిపి పార్టీలు రెండూ పోటాపోటీగా డీజీపీకి ఫిర్యాదు చేస్తూ రాజకీయ కాక పుట్టిస్తున్నాయి.

మహిళా ఎస్సై ని దూషించిన టిడిపి నేత, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారిని అరెస్టు చేయాలని వైసిపి నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి డీజీపీకి వినతి పత్రం సమర్పించారు.

మరోవైపు తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ టీడీపీనేతలు డీజీపీని ఆశ్రయించారు.

”యూజ్‌లెస్‌ ఫెలో” అంటూ ఎస్పీని, పోలీసులను బూతులు తిట్టిన అచ్చం నాయుడు… ఆయన నేతృత్వంలోనే 14 మంది టిడిపి నేతల బృందంతో శుక్రవారం ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిసింది. తమ పార్టీ నేతలపై వైసిపి దాడులు చేస్తుందని డిజిపికి ఫిర్యాదు చేశారు.

అయితే మరోవైపు తెలుగుదేశం నాయకులే వైసిపి నాయకులపై దాడులు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

దళితులపైన టిడిపి నేతలు దాడులకు దిగుతున్నారని ఆయన డీజీపీతో అన్నారు. టిడిపి నేతలు రవికుమార్, అచ్చం న్నాయుడు, నన్నపనేని రాజకుమారి వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారం కోల్పోయినా టిడిపి నాయకులకు ఇంకా కనువిప్పు కలగటం లేదని విమర్శించారు రామకృష్ణారెడ్డి. ఇప్పటికీ టీడీపీ నాయకులు దళితులను అవమానిస్తూనే ఉన్నారని, కాబట్టి వారిపై ఉన్న కేసులను బట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి ఎలా ప్రవర్తించాలో తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ పోటాపోటీ ఫిర్యాదులు, ప్రతి ఫిర్యాదుల తో డిజిపి ఆఫీస్ దగ్గర హడావిడిగా ఉంటే… మరోవైపు దళిత సంఘాలు ఓ దళిత మహిళా ఎస్సై ని టిడిపి నాయకురాలు నన్నపనేని రాజకుమారి కులం పేరుతో దూషించారని చెబుతూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. దళితుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడిన నన్నపనేని రాజకుమారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.