మరీ బాబును మోయొద్దు… పలు ఛానళ్లలో అనధికార ఆదేశాలు

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల కొద్దిగా భయం కూడా ఉండాలి. అది లేకపోతే పాలన సాగించకుండా అడ్డుకునే శక్తులు అమాంతం పెరిగిపోతాయి. జగన్ చేసిన పొరపాటు అదే. తాను సర్వోత్తముడిగా కీర్తించబడాలన్న ఉద్దేశంతో తాను ప్రత్యర్థులను వేధించను, కక్ష సాధింపులు ఉండవు అని దాదాపు అధికారికంగానే ప్రకటించుకున్నారు.

టీడీపీ హయాంలో వైసీపీ నేతలను ప్రభుత్వ కార్యాలయాలకు పిలిపించి తలుపులేసి మరీ వేటకొడవళ్లతో నరికించిన టీడీపీ నేతలకు అదనంగా గన్‌మెన్లను కేటాయించి అహో… ఏమీ… ఈ శాంతిమూర్తి విశాల హృదయం అని కీర్తనలు అందుకోవాలనుకున్నారు జగన్. కానీ అక్కడే పరిస్థితి తిరగబడింది.

జగన్‌ తాను ఎవరినీ ఏమీ అనను అని సంకేతాలు ఇచ్చేసరికి ప్రతిపక్షాల నుంచి, మీడియా ఛానళ్ల వరకు అందరూ జగన్‌ ప్రభుత్వం మీద మితిమీరి కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాను చేసిన తప్పేంటో మూడు నెలలకే జగన్‌కు తెలిసి వచ్చింది కాబోలు. పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం, పుకార్లు ప్రచారం చేస్తున్న మీడియా చానళ్లపై అనధికారికంగా వేటు వేశారు.

దాంతో టీడీపీ భజన చానల్ ఒకటి, రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఏమాత్రం జంకులేకుండా పనిచేస్తూ వస్తున్న మరో ఛానల్‌ ఏపీలో చాలా చోట్ల మూగబోయాయి. స్వయంగా కొడాలి నాని… ఎంఎస్‌వోలను విజయవాడలో బస్‌ భవన్‌కు పిలిపించి ఆ రెండు ఛానళ్లను తొలగించకపోతే ఏం చేయాలో మాకు తెలుసు అంటూ ఎంఎస్‌వోలకు వార్నింగ్ ఇచ్చారని… ఆ మరుసటి రోజే తమ ఛానల్ ప్రసారాలు ఆగిపోయాయని ఒక చానల్‌ వాపోతోంది.

అయితే ప్రభుత్వం నుంచి గానీ, వైసీపీ నుంచి గానీ ఈవ్యవహారంపై మౌనమే సమాధానంగా ఉంది. ఈ చర్య తర్వాత మిగిలిన కొన్ని చానళ్లలో మార్పు కనిపిస్తోంది. పోటీ పడి బాబును మోయడంతో పాటు… ప్రతి చిన్నదానికి జగన్‌ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్న కొన్ని చానళ్లు ఇప్పుడు గొంతు సవరించుకుంటున్నాయి.

జగన్ ప్రభుత్వం మీడియా ప్రచారంపై దృష్టి పెట్టిందని గ్రహించిన కొన్ని చానళ్ల యాజమాన్యాలు ముందే జాగ్రత్తపడుతున్నాయి. మరీ చంద్రబాబును భుజానికెత్తుకుని మోయడం, అదే సమయంలో ప్రభుత్వాన్ని పనిగట్టుకుని దుమ్మెత్తిపోవడం వంటి రిస్క్ మనకెందుకు అని రెండు చానళ్ల పెద్దలు…తమ చానల్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న వారికి హితభోద చేసినట్టు చెబుతున్నారు.

అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వేలుపెట్టి ప్రసారాలకు, చానల్ క్రెడిబులిటీకి ముప్పు తెచ్చుకోవడం ఎందుకని ఒక చానల్ అధినేత సిబ్బందితో మాట్లాడారని చెబుతున్నారు.

బహుశా… జగన్‌ సీఎం అయిన వెంటనే తాను సౌమ్యంగా ఉంటానని పనిగట్టుకుని సంకేతాలు ఇవ్వకపోయి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదేమోనని కొందరంటున్నారు.