Telugu Global
NEWS

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ముగ్గురూ ముగ్గురే

20 టైటిల్స్ గ్రాండ్ చాంపియన్ ఫెదరర్ 19 టైటిల్స్ తో రెండో స్థానంలో నడాల్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో గత రెండుదశాబ్దాలుగా ముగ్గురు మొనగాళ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. గ్రాస్ కోర్టు టెన్నిస్ లో ఫెదరర్, క్లేకోర్టులో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, హార్డ్ కోర్టు టెన్నిస్ లో జోకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గడం ద్వారా తమకుతామే సాటిగా నిలిచారు. ముగ్గురూ ముగ్గురే అనిపించుకొంటూ అలుపెరుగకుండా తమ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ […]

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ముగ్గురూ ముగ్గురే
X
  • 20 టైటిల్స్ గ్రాండ్ చాంపియన్ ఫెదరర్
  • 19 టైటిల్స్ తో రెండో స్థానంలో నడాల్

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో గత రెండుదశాబ్దాలుగా ముగ్గురు మొనగాళ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. గ్రాస్ కోర్టు టెన్నిస్ లో ఫెదరర్, క్లేకోర్టులో స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్, హార్డ్ కోర్టు టెన్నిస్ లో జోకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గడం ద్వారా తమకుతామే సాటిగా నిలిచారు.

ముగ్గురూ ముగ్గురే అనిపించుకొంటూ అలుపెరుగకుండా తమ ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్

కేవలం టెన్నిస్ కోసమే పుట్టిన ఆటగాడు రోజర్ ఫెదరర్. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఓపెన్ ఎరా పురుషుల విభాగంలో …20 సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలిప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్ ను ఐదుసెట్ల పోరులో ఫెదరర్ అధిగమించడం ద్వారా.. 20వ గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అందుకొన్నాడు.

38 ఏళ్ల ఫెదరర్ ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ చేరడమే కాదు… ఆరుసార్లు విజేతగా నిలిచాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ 32సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫైనల్స్ ఆడిన ఫెదరర్ 20 టైటిల్స్ తో పాటు… 332 విజయాలు, 52 పరాజయాల రికార్డుతో నిలిచాడు.

గ్రాస్ కోర్టు టెన్నిస్ లో బాస్….

గ్రాస్ కోర్టు టెన్నిస్ లో బాస్ గా పేరున్న రోజర్ ఫెదరర్ 12వసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ చేరినా 8 సార్లు విజేతగా నాలుగుసార్లు రన్నరప్ గా నిలిచాడు.

రోజర్ ఫెదరర్ ..ఓ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫైనల్స్ చేరడం ఇది 31వసారి.

102 టైటిల్స్ ఒకే ఒక్కడు…

ఆధునిక టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్…తన సుదీర్ఘ కెరియర్ లో 102 టైటిల్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ప్రొఫెషనల్ టెన్నిస్ చరిత్రలో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో ఫెదరర్ అగ్రస్థానంలో నిలిస్తే… క్లేకోర్టు టెన్నిస్ మొనగాడు రాఫెల్ నడాల్ 19 టైటిల్స్ తో రెండు, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.

క్లేకోర్టు కింగ్ నడాల్….

ఫెదరర్ గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో మొనగాడైతే…స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ మాత్రం క్లేకోర్టు టెన్నిస్ లో తిరుగులేని వీరుడు.
19 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ విజయాన్ని 2005 లో నమోదు చేసిన నడాల్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు.

గత 14 సంవత్సరాల కాలంలో.. కెరియర్ గ్రాండ్ స్లామ్ తో పాటు 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణం సైతం నడాల్ సాధించాడు. స్పెయిన్ కు నాలుగుసార్లు డేవిస్ కప్ ను సైతం అందించడంలో నడాల్ ప్రధానపాత్ర వహించాడు. అంతేకాదు టెన్నిస్ ద్వారా 100 మిలియన్ డాలర్లకు పైగా ప్రైజ్ మనీ ఆర్జించాడు.

ఫ్రెంచ్ ఓపెన్ కు మరో పేరు…

నేర్పు, ఓర్పులకు చిరునామాగా నిలిచే ఫ్రెంచ్ ఓపెన్ లో 12సార్లు విజేతగా నిలిచిన ఘనత నడాల్ కు మాత్రమే దక్కుతుంది. 2019 ఫైనల్లో ఆస్ట్రియా సంచలనం డోమనిక్ థీమ్ ను నాలుగుసెట్లలో అధిగమించడం ద్వారా తన రికార్డును తానే తిరగరాయగలిగాడు.

నడాల్ దెబ్బకు ఫెదరర్.. 2006, 2007, 2011, జోకోవిచ్ 2012, 2014 సీజన్లలో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

యూఎస్ ఓపెన్లో నాలుగు టైటిల్స్…

నడాల్.. 2019 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సైతం గెలుచుకొన్నాడు. అమెరికన్ హార్డ్ కోర్టు టెన్నిస్ లో నాలుగోసారి విజేతగా నిలిచాడు. తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకొన్నాడు.

న్యూయార్క్ లోని ఆర్థర్ యాష్ స్టేడియం వేదికగా 4 గంటల 50 నిముషాలపాటు సాగిన హోరాహోరీ ఫైనల్లో 2వ సీడ్ నడాల్.. రష్యాకు చెందిన 5వ సీడ్ ఆటగాడు డేనిల్లీ మెద్వదేవ్ ను అధిగమించాడు.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ టైటిల్ పోరులో నడాల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4తో విజేతగా నిలిచాడు. 33 ఏళ్ల నడాల్ కు 23 ఏళ్ల మెద్వదేవ్ అడుగడుగున గట్టి పోటీ ఇచ్చి వారేవ్వా అనిపించుకొన్నాడు.

2010, 2013, 2017 యూఎస్ టైటిల్స్ నెగ్గిన నడాల్ రెండేళ్ల విరామం తర్వాత తిరిగి నాలుగో టైటిల్ కైవసం చేసుకోగలిగాడు.

30 ఏళ్లు పైబడిన తర్వాత 5 టైటిల్స్…

క్లే కోర్టు స్పెషలిస్ట్ రాఫెల్ నడాల్…ఇప్పటి వరకూ 12 ఫ్రెంచ్ ఓపెన్, 4 యూఎస్, 2 వింబుల్డన్, ఓ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గి.. తన గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకోడం ద్వారా ఫెదరర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మరొక్క టైటిల్ నెగ్గితే ఫెదరర్ 20 టైటిల్స్ రికార్డును నడాల్ సమం చేయగలుగుతాడు.

30 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత ఐదు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా నడాల్ చరిత్ర సృష్టించాడు.

మూడోస్థానంలో జోకోవిచ్….

గ్రాండ్ స్లామ్ టైటిల్స్ రేస్ లో ఫెదరర్, నడాల్ ల తర్వాతి స్థానంలో నిలిచిన మొనగాడు నొవాక్ జోకోవిచ్. ఫెదరర్, నడాల్ లకు గట్టిపోటీ ఇస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకొంటూ వస్తున్న జోకోవిచ్.

అత్యధికంగా 7 ఆస్ట్ర్రేలియన్, 5 వింబుల్డన్, నాలుగు యూఎస్ ఓపెన్ టైటిల్స్ తో పాటు 2016 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సైతం నెగ్గడం ద్వారా గ్రాండ్ స్లామ్ పూర్తి చేయగలిగాడు.

ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ గా జోకోవిచ్… 2018 సీజన్లో సాధించిన వింబుల్డన్, అమెరికన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ను నిలబెట్టుకొన్నాడు.

32 ఏళ్ల జోకోవిచ్ మూడేళ్ల క్రితమే…తొలిసారిగా నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను విజయవంతంగా నిలుపుకోగలిగాడు.

గతంలో ఈ ఘనతను రెండుసార్లు సాధించిన రికార్డు… ఆస్ట్రేలియా దిగ్గజం రాడ్ లేవర్ పేరుతో ఉంది. 1962, 1969 సీజన్లలో రాడ్ లేవర్ క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ రికార్డు సాధించారు.

ఇప్పటికే తన కెరియర్ లో 16 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గి… ఫెదరర్,నడాల్ తర్వాతి స్థానాలలో ఉన్న జోకోవిచ్.. గత 14 సంవత్సరాలలో… ఫ్రెంచ్ ఓపెన్లో నడాల్ ను ఓడించిన ఇద్దరు మొనగాళ్లలో జోకోవిచ్ సైతం ఉన్నాడు.

ప్రపంచ టెన్నిస్ లో ఎందరో నవతరం ఆటగాళ్లు వస్తున్నా…. ఈ ముగ్గురు మొనగాళ్ల ధాటికి నిలువలేకపోతున్నారు.

మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నడాల్, జోకోవిచ్, ఫెదరర్ తమలో తాము పంచుకొంటూ వస్తున్నారు.

మూడుపదుల వయసు దాటినా నవతరం ఆటగాళ్లను మించి ఆడుతూ ముగ్గురూ ముగ్గురే అనిపించుకొంటున్నారు.

First Published:  15 Sep 2019 12:10 AM GMT
Next Story