ఇది ఇస్మార్ట్ స్పీడ్

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ డైలమాలో పడ్డాడని చాలామంది రాసుకొచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయాలనే మీమాంసలో రామ్ పడిపోయాడని, ఎటూ తేల్చుకోలేక గ్యాప్ తీసుకుంటున్నాడని ప్రచారం జరిగింది.

అయితే ఇవన్నీ అబద్ధాలని నిరూపించాడు రామ్. ఒకేసారి 3 సినిమాలు లైన్లోపెట్టి తన ఇస్మార్ట్ స్పీడ్ ను బయటపెట్టాడు. అవును.. రామ్ ఏకంగా 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వీవీ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు రామ్. ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య కథాచర్చలు ముగిశాయి. ఇస్మార్ట్ టైపులోనే వినాయక్ మూవీ కూడా పక్కా మాస్ మూవీ. కాకపోతే కామెడీ పుష్కలంగా ఉంటుందట. ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తడమ్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు రామ్. ఈ సినిమా రైట్స్ ను రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్ పైకి వస్తుందనేది అప్పుడే చెప్పలేం.

వినాయక్ ఎంత త్వరగా స్క్రీన్ ప్లే రెడీ చేస్తాడనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు రామ్.

ఇలా ఒకేసారి 3 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన స్పీడ్ చూపించాడు రామ్.