ఉప్పూ… నిప్పులను కలిపిన జగన్

వారిద్దరూ దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధులు. వారిద్దరూ దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచించిన వారు. ఒకరు వెళ్లిన దారిలోకి మరొకరు వెళ్లరు. ఒకరు వెళ్లిన ఇంటి వైపు మరొకరు తొంగి చూసేవారు కాదు. అలాంటి ఆ ఇద్దరు ఇప్పుడు ఒకే గూటికి చేరారు. అలా వారిద్దరి మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని తొలగించి స్నేహ హస్తాన్ని అందించేలా చేసారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా. వారే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు.

ఈ ఇద్దరికి మధ్య పచ్చగడ్డే కాదు… ఏం వేసినా భగ్గున మండిపోతుందని జిల్లా వాసులకే కాదు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ నాయకులకూ తెలుసు. తూర్పు గోదావరి జిల్లాలో రెండు కులాల మధ్య వైరం ఈ ఇద్దరు నాయకుల మధ్యే ఉండేదని రాజకీయ అభిప్రాయం.

అయితే ఆదివారం నాడు తోట త్రిమూర్తులు అధికార వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాసిన తోట త్రిమూర్తులు ఆదివారం నాడు అధికార పార్టీలో చేరారు.

ఎన్నాళ్లుగానో ఉప్పు, నిప్పులా వ్యవహరించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు కలిసి ముఖ్యమంత్రిని కలవడం జిల్లా రాజకీయాలే కాదు రాష్ట్ర్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి వద్దకు తోట త్రిమూర్తులను తీసుకువెళ్లింది ఎన్నాళ్ల నుంచో ఆయనతో వైరం ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కావడంతో జిల్లాలో సంచలనమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తోట త్రిమూర్తులు చేరిక అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ మధ్య ఉన్న వైరం నేటితో ముగిసిందని, ఇద్దరం జిల్లా ప్రగతి కోసం పనిచేస్తామని ప్రకటించారు.

అంతే కాదు.. తోట త్రిమూర్తులు కూడా విలేకరులతో మాట్లాడిన తర్వాత తన పక్కనే ఉన్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఉద్దేశించి “అన్నా… నువ్వు మాట్లాడే” అంటూ సంబోధించడం విలేకరులను కూడా ఆశ్చర్యానికి గురి చేయడం విశేషం.