ఈసారి సురేష్ బాబు వల్ల కూడా కాలేదు

ఓ సినిమాను సాఫీగా రిలీజ్ చేయాలంటే సురేష్ బాబు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో అత్యథిక థియేటర్లు కలిగి ఉండడంతో సురేష్ బాబు తలుచుకుంటే సినిమా రిలీజ్ ఈజీ అయిపోతుంది. అందుకే చాలామంది నిర్మాతలు, కొత్త మేకర్స్ తమ సినిమాల్ని సురేష్ బాబు చేతిలో పెడుతుంటారు. అలాంటి సురేష్ బాబుకే ఇప్పుడు చిక్కొచ్చిపడింది. స్వయంగా తను నిర్మిస్తున్న సినిమానే విడుదల చేసుకోలేని పరిస్థితికి చేరిపోయాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రస్తుతం వెంకీమామ సినిమాను నిర్మిస్తున్నాడు సురేష్ బాబు. ఈ సినిమాను అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయాలనేది ప్లాన్. సైరా సినిమా పోస్ట్ పోన్ అయితే అనుకున్న టైమ్ కు వచ్చేయొచ్చని సురేష్ బాబు ప్లాన్ వేశాడు. కానీ సైరా వాయిదాపడడం లేదు. దీంతో వెంకీమామను పోస్ట్ పోన్ చేయక తప్పలేదు.

ఇక నవంబర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నాడు… కానీ అది కూడా సాధ్యం కాలేదు. దీపావళి బరిలో పలు సినిమాలు ఇప్పటికే థియేటర్లలో ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో సురేష్ బాబుకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకలేదు.

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెంకీమామను డిసెంబర్ కు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. డిసెంబర్ లో కూడా క్రిస్మస్ బరిలో పోటీ తీవ్రంగా ఉంది. డిస్కోరాజా, ప్రతిరోజూ పండగే లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఈసారి కూడా సురేష్ బాబు తన సినిమాను రిలీజ్ చేసుకోలేకపోతే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే.