వియ్యంకుడి నవయుగ కోసమే ఈనాడు రామోజీ విలాపం…

పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్‌ను తప్పుపడుతూ ఈనాడు పత్రిక ప్రచురించిన కథనంపై మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ మండిపడ్డారు. ఈనాడులో వచ్చిన కథనం బట్టి ఆ పత్రిక యాజమాన్యపు తెరవెనుక ఉద్దేశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయన్నారు.

బంధువుకు చెందిన నవయుగ (కంపెనీ అధినేత రామోజీరావు వియ్యంకుడు) కంపెనీకి పోలవరం ప్రాజెక్టు దక్కలేదన్న బాధతోనే రామోజీ రావు ఇలాంటి అసత్య కథనాలు రాయించారని అనిల్ విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 10 నుంచి 20 శాతం తక్కువ ధరలకే కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి వందల కోట్ల మేలు జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా రామోజీరావు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

రివర్స్‌ టెండరింగ్‌పై నిపుణులు బాధపడుతున్నారంటూ పత్రికలో చెప్పిన ఈనాడు… ఆ బాధపడుతున్న నిపుణులెవరో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హెడ్‌ వర్క్స్, జల విద్యుత్‌ కేంద్రం పనులను వేర్వేరుగా కాంట్రాక్టర్లకు అప్పగించాలని రూల్ ఉందంటూ ఈనాడు పత్రిక రాయడాన్ని కూడా అనిల్ ప్రస్తావించారు.

మరి రెండు పనులు ఒకరే చేయకూడదని రూల్ ఉన్నప్పుడు ఇదివరకు ఆ రెండు పనులనూ నవయుగ కంపెనీ ఎలా దక్కించుకుందని అనిల్ ప్రశ్నించారు. ఈ విషయం ఈనాడు పాఠకులకు తెలియదన్న ఆ పత్రిక ధీమాకు జోహర్లు అర్పిస్తున్నామని మంత్రి అనిల్ విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీకి ఏటీఎంగా మారిందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ.. అందుకు కారణమైన అదే కాంట్రాక్టర్‌ను ఇంకా కొనసాగించాలని ‘ఈనాడు’ పత్రిక వాదిస్తోందంటే అందుకు కారణం పాఠకులతో ఉన్న బాంధవ్యం కాదని, నవయుగానుబంధం అన్నది స్పష్టమవుతోందని మంత్రి విమర్శించారు.

ప్రతి పనిలో చంద్రబాబు కుంభకోణాలు చేసినా వాటిని దాచేసి… చంద్రబాబు వల్ల… చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం అన్నట్టుగా జర్నలిజాన్ని పణంగా పెట్టారని విమర్శించారు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమైందని… అందుకే మొన్నటి ఎన్నికల్లో జనం చిత్తుగా ఓడించారన్నారు.

ప్రజలు ఇలా వాతలు పెట్టినా… వాతలు వాతలే… మా రాతలు రాతలే అన్నట్టుగా రామోజీరావు వైఖరి ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.