ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన సైరా యూనిట్

సైరా సినిమాపై వినిపిస్తున్న ఊహాగానాలు అన్నీఇన్నీ కావు. సినిమా వాయిదా అని కొందరు అంటుంటే.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వాయిదా అని మరికొందరు. ట్రయిలర్ లాంచ్ కూడా పోస్ట్ పోన్ అంటూ మరికొందరు. ఇలా సైరా చుట్టూ చాలా ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు దీనిపై ఓ చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనిట్. కొద్దిసేపటి కిందట కొణెదల ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను వాయిదా వేసిన విషయాన్ని అధికారికంగా ప్రకటించింది యూనిట్. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 18 నుంచి 22కు మార్చినట్టు తెలిపింది. అయితే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను వాయిదా వేసినా ట్రయిలర్ లాంఛ్ ను మాత్రం అనుకున్న తేదీకే విడుదల చేస్తామని తెలిపింది. అంటే రేపే సైరా ట్రయిలర్ లాంచ్ ఉంటుందన్నమాట.

రేపు సాయంత్రం 5 గంటలకు సైరా ట్రయిలర్ రిలీజ్ అవుతుంది. టీజర్ రిలీజ్ చేసినట్టుగానే, ట్రయిలర్ ను కూడా ఏకంగా 5 భాషల్లో విడుదల చేయబోతున్నారు. అంతేకాదు, రేపు సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో సైరా ట్రయిలర్ ను ప్రసారం చేయబోతున్నారు. విజయవాడలో రేపు సాయంత్రం 5 గంటలకు 3 థియేటర్లలో సైరా ట్రయిలర్ ను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. 2 నిమిషాల 50 సెకన్ల నిడివి ఉంది. డైలాగ్స్ కంటే ఎక్కువగా యాక్షన్ ఎలిమెంట్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. చిరంజీవి డైలాగ్స్ మాత్రం 2 ఉంటాయని తెలుస్తోంది. దీంతోపాటు సినిమా భారీతనాన్ని తెలిపేలా ట్రయిలర్ లో విజువల్స్ ఉండబోతున్నాయి.