ఎన్టీఆర్ కి బాకీ ఉన్నాను….

దర్శకుడు హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాథమ్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. అయితే హరీష్ దర్శకత్వం వహించిన సినిమాల్లో భారీ డిజాస్టర్ సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. హరీష్ శంకర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

2013లో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే డిజాస్టర్ అయిన సినిమాలో ఒకటిగా నిలిచింది. అయితే హరీష్ శంకర్ ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

తాజాగా ‘వాల్మీకి’ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఎన్టీఆర్ గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ తన అభిమాన హీరో అని, ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ సినిమా బాకీ ఉన్నానని అన్నాడు హరీష్ శంకర్.

“రామయ్య వస్తావయ్య సినిమాతో ఎన్టీఆర్ నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మళ్లీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. ఈసారి ఎన్టీఆర్ కి ఎలాగైనా ఒక మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ని ఇచ్చి తీరుతాను” అని అన్నారు హరీష్ శంకర్.

మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘వాల్మీకి’ సెప్టెంబర్ 20న విడుదలకు సిద్ధమవుతోంది.