పద్మావతికి హుజూర్ నగర్ టికెట్…. భగ్గుమన్న రేవంత్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలవడంతో… తాను ఎమ్మెల్యేగా గెలిచిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో… అభ్యర్థిగా ఆయన భార్య పద్మావతినే ఇటీవల ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ఈ ప్రకటన కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది.

పద్మావతిని హుజూర్ నగర్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిరసన తెలిపారు. హుజూర్ నగర్ లో చామల కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని పోటీచేయిస్తానని.. ఆయనకు మద్దతు కూడా ఉత్తమ్ ఇచ్చారని రేవంత్ సంచలన కామెంట్స్ చేశారు.

అందరూ చామల కిరణ్ రెడ్డినే హుజూర్ నగర్ అభ్యర్థిగా అనుకుంటున్న వేళ ఉత్తమ్ ఇలా పీసీసీ చీఫ్ హోదాలో తన భార్యను అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. దీనిపై రేవంత్ రెడ్డి ఇప్పటికే తన నిరసన తెలపగా.. మిగతా వారు కూడా గళమెత్తేందుకు రెడీ కావడం గమనార్హం.

ఇక హుజూర్ నగర్ లో ఉత్తమ్ ఆ తర్వాత ఆయన భార్యకు సీటు ఇవ్వడం వారసత్వ రాజకీయాన్ని కొనసాగించడమేనని.. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దని పలువురు కాంగ్రెస్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లడానికి రెడీ అయ్యారు.

పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ తన వ్యక్తిగత ఇమేజ్ ను బలపరుచుకుంటున్నాడని వారు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మొత్తంగా హుజూర్ నగర్ అసెంబ్లీ సీటు ఇప్పుడు కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది.