నాగార్జున పొలంలో కుళ్లిన మృతదేహం…

టాలీవుడ్ అగ్రహీరో నాగార్జునకు చెందిన పొలంలో కుళ్లిపోయిన స్థితిలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం పాపిరెడ్డి గూడలో నాగార్జునకు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం ఉంది.

ఇక్కడ ఈ ఖరీఫ్ లో విస్తారంగా వర్షాలు పడడంతో సేంద్రియ పంటలు పండించేందుకు హీరో నాగార్జున రెడీ అయ్యాడు. ఇందుకోసం నిపుణులతో కలిసి అక్కడికి వెళ్లాడు.

అయితే పొలాన్ని చదును చేస్తున్న క్రమంలోనే పొలంలో ఉన్న ఓ గదిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది.. వెంటనే డెడ్ బాడీ గురించి పోలీసులకు సమాచారం అందించారు.

దాదాపు ఆరేడు నెలలుగా ఇక్కడికి ఎవరూ రాలేదు.. ఖాళీగా ఉన్న క్షేత్రంలోని గదిలో మనిషి చనిపోయి ఉండడం.. పూర్తిగా కుళ్లిపోయి ఎముకుల గూడులా మారిపోయి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. శవం దొరికిన గదిని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇక్కడే ఎందుకు మరణించాడు? ఎప్పుడు మరణించాడు.? ఫాంహౌస్ కు వ్యక్తికి సంబంధం ఉందా.? ఇది ఆత్మహత్యా? హత్యా? అన్న విషయం పోస్టుమార్టం తర్వాత తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. తన ఫాంహౌస్ లో మృతదేహం దొరికిన ఘటనపై నాగార్జున మాత్రం ఇంతవరకు స్పందించలేదు.