విరాటపర్వం నుంచి మరో వీడియో లీక్

సెట్స్ పైకి వచ్చిన మొదటి రోజు నుంచి విరాటపర్వం సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. సహజసిద్ధమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుండడం ఈ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ప్రజల మధ్య షూట్ చేయడంతో ఎవరికి వారు వీడియోలు, ఫొటోలు తీసి నెట్ లో పెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న జగిత్యాల బస్టాండ్ లో సాయిపల్లవిపై ఓ సీన్ తీస్తే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అలాంటిదే మరో వీడియో బయటకు వచ్చింది.

విరాటపర్వం సినిమాకు సంబంధించి ఈసారి కూడా సాయిపల్లవిపై మరో సీన్ తీశారు. నల్గొండ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఈ షెడ్యూల్ నడుస్తోంది. అటవీ ప్రాంతానికి కాస్త దగ్గరగా తీస్తున్న ఈ సన్నివేశాల్ని కూడా కొంతమంది షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

మేకప్ లేకుండా సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తోంది. అత్యంత సహజంగా కనిపిస్తోంది. ఓవైపు వీడియోలు ఇలా లీక్ అవుతున్నప్పటికీ యూనిట్ మాత్రం టెన్షన్ పడడం లేదు. వాటిని సినిమాకు ప్రచారంగా భావిస్తోంది. మరోవైపు హీరో రానా ఇంకా సెట్స్ పైకి రాకపోవడం మాత్రం యూనిట్ ను కలవరపెడుతోంది.