మోడీ సర్కార్ ఎల్‌ఐసీని ముంచేసిందా?

ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ నిధులను కేంద్రం దారి మళ్లించిందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎల్‌ఐసీని మోడీ ప్రభుత్వ నాశనం చేస్తోందని… లక్షలాదిమంది డిపాజిటర్ల సొమ్మును దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఎల్‌ఐసీకి చెందిన 10.5 లక్షల కోట్లను కేంద్రం తీసుకుని నష్టదాయక సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందని… కాంగ్రెస్‌ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి అజయ్‌ మాకెన్ సంచలన ఆరోపణలు చేశారు.

అందులో 21 వేల కోట్లు తీసుకెళ్లి ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడిగా పెట్టారని… ఆ బ్యాంకు నష్టాలు, నిరద్ధక ఆస్తుల కారణంగా ఆ సొమ్ము మునిగిపోయిందని మాకన్ ఆరోపించారు.

ఆర్‌బీఐ నుంచి బలవంతంగా సొమ్ము లాక్కున్న కేంద్ర ప్రభుత్వం… ఎల్‌ఐసీ నుంచి కూడా తక్కువ కాలంలోనే 10.5 లక్షల కోట్లు తీసుకుని బ్యాంకుల్లో పెట్టుబడిగా పెట్టిందన్నారు.

ఆర్‌బీఐ విడుదల చేసిన వివరాల్లో కొన్ని సంచలన నిజాలు ఉన్నాయన్నారు. 1956 నుంచి 2014 వరకు 11. 94 లక్షల కోట్ల ఎల్‌ఐసీ సొమ్మును పెట్టుబడులుగా పెడితే…. 2015 -2019 మధ్యలోనే ఏకంగా 10. 7 లక్షల కోట్లు తరలించారని మాకెన్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. కేవలం గత రెండు నెలల్లోనే ఎల్‌ఐసీ 57వేల కోట్ల సొమ్మును నష్టపోవడాన్ని ఆమె తీవ్ర అంశంగా అభివర్ణించారు.

నమ్మకానికి మారుపేరుగా ఉంటున్న ఎల్‌ఐసీకి చెందిన సొమ్మును తీసుకెళ్లి మునిగిపోయిన కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టి ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారని ఆమె విమర్శించారు. భవిష్యత్తు భద్రత కోసం ప్రజలు మదుపు చేసిన ఎల్‌ఐసీ సొమ్ముతో ఇలాంటి నష్టదాయక పెట్టుబడులు పెట్టడం ఏమిటని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.