కేసీఆర్ కు షాక్ ఇచ్చిన గవర్నర్ తమిళి సై

ఏరికోరి మహిళా గవర్నర్ తమిళిసైను తెలంగాణకు పంపినప్పుడే కేసీఆర్ ను బీజేపీ టార్గెట్ చేసిందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. అందుకు అనుగుణంగా తమిళిసై అడుగులు వేస్తుండడం తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాల్లో కలకలం రేపుతోంది.

గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక తమిళి సై యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ తీరుపై కొందరు ఫిర్యాదు చేయడంతో రాజ్ భవన్ లోనే తాను ‘ప్రజాదర్భార్’ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించి తమిళిసై సంచలనం సృష్టించారు.

ఇక ఇప్పటికే హోంశాఖ, ఇరిగేషన్ శాఖలను…. ఆయా ప్రాజెక్టులు, శాంతి భద్రతలపై నివేదికలను కోరి సంచలనం రేపారు.

తాజాగా మరోసారి తమిళి సై తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. తెలంగాణలో ప్రబలుతున్న విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలపై నివేదిక కోరారు. పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. దీంతో ఆ నివేదికను రెడీ చేసే పనిలో అధికారులున్నారు.

కాగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న తమిళిసై వ్యవహారశైలిని కేసీఆర్ అండ్ కో నిశితంగా గమనిస్తోంది. గవర్నర్ నేరుగా నివేదికలు కోరడం.. పాలనలో జోక్యం చేసుకోవడం కేసీఆర్ కు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.