Telugu Global
NEWS

ఈ జిల్లాలో బీజేపీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ కి ఆ జిల్లా ఒకప్పుడు కంచుకోట. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆ కంచుకోట కు బీటలు వారాయి. కమలదళం ఆ కోటను ఇప్పటికే కొంత ఆక్రమించేసింది. మిగతా సగాన్ని జయించటానికి కసరత్తులు చేస్తున్నది. అయినా కాంగ్రెస్ లో ఉలుకు పలుకు లేకపోయింది. నేషనల్ లెవెల్లో ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులు చెప్పుకోదగినంత మందే ఉన్నారు. కానీ జిల్లాకు ఆదుస్థితి ఎందుకు వచ్చినట్లు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీదే హవా. దాదాపు […]

ఈ జిల్లాలో బీజేపీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్
X

కాంగ్రెస్ కి ఆ జిల్లా ఒకప్పుడు కంచుకోట. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆ కంచుకోట కు బీటలు వారాయి. కమలదళం ఆ కోటను ఇప్పటికే కొంత ఆక్రమించేసింది. మిగతా సగాన్ని జయించటానికి కసరత్తులు చేస్తున్నది. అయినా కాంగ్రెస్ లో ఉలుకు పలుకు లేకపోయింది. నేషనల్ లెవెల్లో ఆ జిల్లా కాంగ్రెస్ నాయకులు చెప్పుకోదగినంత మందే ఉన్నారు. కానీ జిల్లాకు ఆదుస్థితి ఎందుకు వచ్చినట్లు?

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీదే హవా. దాదాపు అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలిచాయి. అందుకే కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి తలకిందులైంది. దీంతో నాయకుల్లో, కార్యకర్తల్లో నిస్తేజం నిండిపోయింది. ముఖ్యంగా నాయకులు… కార్యకర్తలకు భరోసా ఇస్తూ ముందుకు నడపాల్సింది పోయి పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, రాష్ట్ర పార్టీ జాతీయ నాయకుడు పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో కాంగ్రెస్ ని బలోపేతం చేయడంలో అంతగా శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. ఫలితంగా పార్టీని నిస్సత్తువ ఆవరించి ఉందని కార్యకర్తలు అంటున్నారు.

జిల్లా పరిషత్ ఎన్నికల సమయంలో మెజార్టీ సీట్లు సాధించాలని ప్లాన్ చేసుకున్నారు. గెలిచిన తర్వాత పార్టీలు మారకూడదని అభ్యర్థుల చేత బాండ్లు కూడా రాయించుకున్నారు. ఆ విధంగా రాష్ట్రంలో నే కొత్త ఒరవడికి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. కానీ కరీంనగర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. దీంతో కేడర్ నిరుత్సాహానికి గురి అయింది.

పార్టీలో ఆనాటి ఉత్సాహం, దూకుడు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమాల్లో నైనా జిల్లా పార్టీ చురుకుగా ఉందా అంటే అదీ లేదనే చెప్పాలి. ఈ పరిస్థితులను బిజెపి క్యాష్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విస్తరించాలని భావిస్తున్నది. ఇక్కడ బిజెపి కి వచ్చిన ప్రతి స్థానం కాంగ్రెస్ దే అనేది మరువరానిది.

త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి జిల్లా కాంగ్రెస్ నాయకత్వం ఎటువంటి వ్యూహాలను పన్నుతుందో అని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న జిల్లా నేతలు ముందు జిల్లా పార్టీని పటిష్టం చేయడంలో దృష్టిసారించాలని… ఇందులో భాగంగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారికి దిశానిర్ధేశం చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంతగా దెబ్బతినడానికి కారణం నాయకుల మధ్య జరుగుతున్న కోల్డ్ వారే అని తెలుస్తున్నది. ఎవరికి వారు తామే ఎక్కువ అని నాయకులు భావిస్తూ కీచులాడుకుంటున్నారు. ఈ కీచులాటలు పార్టీ కొంప ముంచుతున్నాయి అని కార్యకర్తలు అంటున్నారు.

First Published:  21 Sep 2019 12:28 AM GMT
Next Story