Telugu Global
National

యుపి రైతుల ఢిల్లీ మార్చ్

చెరకు పంట బకాయిలు చెల్లించడం, పూర్తి రుణమాఫీ, ఉచిత విద్యుత్తును ఇవ్వాలన్న డిమాండ్లతో ఉత్తర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి 15 వేల మంది రైతులు శనివారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 69 నుండి న్యూ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వైపు తమ పాదయాత్రను ప్రారంభించారు. భారత్ కిసాన్ యూనియన్ (బికెయు) ఆధ్వర్యం లో వారు నిరసన మార్చ్ చేస్తున్నారు. సెప్టెంబరు 17 న రైతులు ప్రారంభించిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో డిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో భారీ […]

యుపి రైతుల ఢిల్లీ మార్చ్
X

చెరకు పంట బకాయిలు చెల్లించడం, పూర్తి రుణమాఫీ, ఉచిత విద్యుత్తును ఇవ్వాలన్న డిమాండ్లతో ఉత్తర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి 15 వేల మంది రైతులు శనివారం ఉదయం నోయిడాలోని సెక్టార్ 69 నుండి న్యూ ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వైపు తమ పాదయాత్రను ప్రారంభించారు.

భారత్ కిసాన్ యూనియన్ (బికెయు) ఆధ్వర్యం లో వారు నిరసన మార్చ్ చేస్తున్నారు. సెప్టెంబరు 17 న రైతులు ప్రారంభించిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో డిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

“ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు మా నిరసన కొనసాగుతుంద”ని ఒక రైతు అన్నాడు. కవాతు మార్గంలో పారా మిలటరీ బలగాల వంటి వాటితో భారీగా భద్రతా దళాలను మోహరించారు.

రైతులు ఘజిపూర్ సరిహద్దు నుండి 24వ జాతీయ రహదారి ద్వారా డిల్లీలోకి ప్రవేశిస్తారని భావిస్తున్నారు.

బికెయు అధ్యక్షుడు పురన్ సింగ్ మాట్లాడుతూ… “వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులతో మా చర్చలు విఫలమైన తరువాత, మా డిమాండ్ల పట్ల అందరి దృష్టిని ఆకర్షించడానికి డిల్లీకి మార్చ్ చేయడం ఒక్కటే మార్గం” గా భావించామని అన్నారు.

ఢిల్లీకి వెళ్ళిన తరువాత కూడా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేయాలని రైతులు నిర్ణయించారు.

బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న తరువాత పంటను పండించామని, కాని ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించక పోవడం తో తిరిగి ఆ రుణాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఇద్దరు రైతులు చేసిన విజ్ఞప్తిపై చెరకు సాగుదారుల బకాయిలను క్లియర్ చేయాలని అలహాబాద్ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

First Published:  21 Sep 2019 6:51 AM GMT
Next Story