Telugu Global
NEWS

45 రోజుల్లోనే సీమ ప్రాజెక్టులను నింపేందుకు ప్రణాళిక

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కర్నూలు జిల్లా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. వరదల నేపథ్యంలో నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో జగన్‌ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 33వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని… రెండు వేల హెక్టార్లలో వాణిజ్యపంటలు దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. పంట నష్టంపోయిన రైతుల పట్ల, నష్టపోయిన ప్రజల పట్ల అధికారులు ఉదారంగా […]

45 రోజుల్లోనే సీమ ప్రాజెక్టులను నింపేందుకు ప్రణాళిక
X

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కర్నూలు జిల్లా ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. వరదల నేపథ్యంలో నంద్యాల, ఆళ్లగడ్డ, మహానంది ప్రాంతాల్లో జగన్‌ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో 33వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని… రెండు వేల హెక్టార్లలో వాణిజ్యపంటలు దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. పంట నష్టంపోయిన రైతుల పట్ల, నష్టపోయిన ప్రజల పట్ల అధికారులు ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. గీత గీసుకుని ఉండాల్సిన అవసరం లేదని… భారీ వర్షం వల్ల నష్టపోయిన వారిని అదుకునేందుకు ఉదారంగా ఉండాలన్నారు.

రాయలసీమలో ఈ స్థాయి వర్షాలు అరుదుగా వస్తుంటాయన్నారు. పది రోజుల క్రితం వరకు ఐదు జిల్లాల్లో వర్షాలు లేవని బాధపడుతుండేవారిమన్నారు. ఈ వర్షాలతో నీటి సమస్య తీరిపోయిందన్నారు. భూగర్భజలాలు పెరిగాయన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రమే కొద్దిగా లోటు ఉందని… మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతం నమోదైందన్నారు.

కర్నూలు జిల్లాలో అధిక వర్షపాతం నమోదు అయిందన్నారు. ఈ వర్షం వల్ల కొద్దిగా ఇబ్బందులు కూడా వచ్చాయన్నారు. కర్నూలు జిల్లాలోని 17 మండలాల్లో భారీ వర్షం పడడం వల్ల కొద్దిగా నష్టం జరిగిందన్నారు. భారీ వర్షాల వల్ల రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయన్నారు.

శాశ్వతంగా కరువు నివారణ కోసం రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 120 రోజుల పాటు శ్రీశైలంలోకి వరద వస్తుందన్న ఆలోచనతో ఇప్పుడు పనిచేయలేమన్నారు. శ్రీశైలంలోకి వస్తున్న నీరు రానురాను తగ్గిపోతోందన్నారు. గడిచిన పదేళ్లలో శ్రీశైలంలోకి వచ్చే నీరు 600 టీఎంసీలకు పడిపోయిందన్నారు. ఐదేళ్లలో 400 టీఎంసీలకే నీటి లభ్యత పడిపోయిందన్నారు. ఈ ఏడాది భారీగా వరద వచ్చిందని కానీ శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.

ఎగువున ఆల్మట్టి ఎత్తు కూడా పెంచుతున్నారని… దాని వల్ల మరో 100 టీఎంసీల నీరు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో కృష్ణా ఆయకట్టును రక్షించుకోవాలన్నా, రాయలసీమను కాపాడుకోవాలన్నా గోదావరి జలాలను శ్రీశైలంలోకి తీసుకురావడమే మార్గమన్నారు. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ చర్చలు జరుపుతున్నామన్నారు.

రాయలసీమలోని ప్రాజెక్టులను 120 రోజుల్లో కాకుండా 45రోజుల్లోనే నింపేలా కాలువలను వెడల్పు చేస్తామన్నారు. 45 రోజుల్లోనే రాయలసీమలోని ప్రాజెక్టులను నింపేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సీఎం వివరించారు.

First Published:  21 Sep 2019 6:42 AM GMT
Next Story