ఒక్కరోజు ఆలస్యంగా బీసీసీఐ ఎన్నికలు

  • హర్యానా, మహారాష్ట్ర్ర ఎన్నికల ప్రభావం

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి కమ్ బీసీసీఐ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశాల మేరకు … సరికొత్త నిబంధనలతో బీసీసీఐ అనుబంధ సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

బీసీసీఐకి సైతం అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అయితే…హర్యానా, మహారాష్ట్ర్ర శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21న జరుగనుండడంతో…బీసీసీఐ ఎన్నికలను ఒక్కరోజు ఆలస్యంగా అక్టోబర్ 23న నిర్వహించనున్నట్లు పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు.

బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మొత్తం క్రికెట్ సంఘాలలో పూర్తిస్థాయి హోదా కలిగిన 24 క్రికెట్ సంఘాలు కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకొన్నాయి.

ఇండియన్ రైల్వేస్, సర్వీసెస్, ఇండియన్ యూనివర్శిటీస్ క్రికెట్ సంఘాలు మాత్రం తమతమ ప్రతినిధులను బీసీసీఐకి పంపుతాయి.

బీసీసీఐకి ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పాటు కావడంతోనే సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల పాలకమండలి విధుల నుంచి ఉపసంహరించుకోనుంది.

2017 నుంచి వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి పర్యవేక్షణలోనే బీసీసీఐ పని చేస్తూ వస్తోంది.