Telugu Global
NEWS

కోడెల మృతిపై సీబీఐ అవసరం లేదు : హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిల్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. “ఈ పిటీషన్ లో ప్రజా ప్రయోజనం ఏదీ కనిపించడం లేదు” అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించిన ఫర్నీచర్ ను కోడెల శివప్రసాద్ తన ఇంటికి తరలించడంతో పాటు ఆయన కుమారుడు, కుమార్తె తమ నియోజకవర్గంలో కే టాక్స్ పేరుతో భారీగా దందాలకు పాల్పడడం కూడా సంచలనం అయ్యింది. నాలుగు దశాబ్దాల రాజకీయ […]

కోడెల మృతిపై సీబీఐ అవసరం లేదు : హైకోర్టు
X

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న పిల్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.

“ఈ పిటీషన్ లో ప్రజా ప్రయోజనం ఏదీ కనిపించడం లేదు” అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించిన ఫర్నీచర్ ను కోడెల శివప్రసాద్ తన ఇంటికి తరలించడంతో పాటు ఆయన కుమారుడు, కుమార్తె తమ నియోజకవర్గంలో కే టాక్స్ పేరుతో భారీగా దందాలకు పాల్పడడం కూడా సంచలనం అయ్యింది.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తాను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొవడం, చివరి అంకంలో దొంగగా ముద్ర పడడం, తన అనుకున్న వారంతా కాని వారిగా ప్రవర్తించడం వంటి కారణాలతో కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తనకు అండగా లేరని, తాను ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా ఆయన నుంచి స్పందన రాలేదని కోడెల తన సన్నిహితుల వద్ద వాపోయారంటూ వార్తలు వచ్చాయి. కోడెల శివప్రసాద్ మరణానంతరం దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ కూడా చేశాడు.

కోడెల శివప్రసాద్ ఆత్మహత్యను రాజకీయంగా వాడుకోవాలని కూడా చంద్రబాబు నాయడు తీవ్రంగా ప్రయత్నించాడు. మరోవైపు అనీల్ కుమార్ అనే వ్యక్తి కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం నాడు హైకోర్టులో వాదనలు వినిపించారు.

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై దర్యాప్తు జరుగుతుండగా కోర్టు అందులో జోక్యం చేసుకోలేదని, తెలంగాణ పోలీస్ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు బంజారాహిల్స్ పోలీసులు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంపై అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ అంశంలో కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల వాగ్మూలం తీసుకోవాల్సి ఉందని, ఇంకా ఫోరెన్సిక్ నివేదిక రాలేదని బంజారాహిల్స్ పోలీసులు హైకోర్టుకు విన్నవించారు.

“కోడెల శివప్రసాద్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని పిల్ వేసిన అనీల్ కుమార్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు” అని హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని పోలీసులు హైకోర్టుకు విన్నవించారు.

First Published:  24 Sep 2019 9:12 PM GMT
Next Story