Telugu Global
NEWS

సంతకాలు వేర్వేరు... లింగమనేనిపై క్రిమినల్ కేసులు పెడతాం...

కరకట్టపై అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌజ్‌ను కూల్చవద్దంటూ ఏపీ ప్రభుత్వానికి లింగమనేని రమేష్‌ లేఖ రాయడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన గెస్ట్‌ హౌస్‌ను ఎందుకు కూల్చకూడదు అని ప్రశ్నించారు. ఇదే దేవినేని ఉమా 2014లో నది వెంబడి పడవ ప్రయాణం చేసి లింగమనేని రమేష్ గెస్ట్‌ హౌస్‌తో సహా అక్రమ కట్టడాలను కూల్చివేస్తానని చెప్పింది నిజం కాదా అని ఆర్కే ప్రశ్నించారు. ఆ విషయం లింగమనేని రమేష్ […]

సంతకాలు వేర్వేరు... లింగమనేనిపై క్రిమినల్ కేసులు పెడతాం...
X

కరకట్టపై అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌజ్‌ను కూల్చవద్దంటూ ఏపీ ప్రభుత్వానికి లింగమనేని రమేష్‌ లేఖ రాయడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన గెస్ట్‌ హౌస్‌ను ఎందుకు కూల్చకూడదు అని ప్రశ్నించారు.

ఇదే దేవినేని ఉమా 2014లో నది వెంబడి పడవ ప్రయాణం చేసి లింగమనేని రమేష్ గెస్ట్‌ హౌస్‌తో సహా అక్రమ కట్టడాలను కూల్చివేస్తానని చెప్పింది నిజం కాదా అని ఆర్కే ప్రశ్నించారు. ఆ విషయం లింగమనేని రమేష్ మరిచిపోయారా అని నిలదీశారు. చంద్రబాబు ఆడిస్తున్నట్టుగా లింగమనేని రమేష్ ఆడుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

లింగమనేని భూముల వద్దే సరిగ్గా ల్యాండ్ పూలింగ్ ఆగిపోయేలా చంద్రబాబు చేశారని… అందుకు ప్రతిఫలంగానే గెస్ట్‌ హౌస్‌ను చంద్రబాబుకు కట్టబెట్టారన్నారు. సీఎం హోదాలో చంద్రబాబు ఇంటికి అద్దె కింద ప్రభుత్వం నెలనెల లక్ష రూపాయలు చెల్లించిందని… ఇలా ఐదేళ్లలో 60 లక్షలు తీసుకున్నారని వివరించారు. లోకేష్ కూడా లింగమనేని గెస్ట్ హౌజ్‌లోనే ఉంటూ మరో 60 లక్షలు అద్దెకింద ప్రభుత్వం నుంచి తీసుకున్నారని ఆర్కే వివరించారు. ఆ డబ్బులను లింగమనేని రమేష్‌కు అద్దె కింద ఇచ్చారా? ఇచ్చి ఉంటే ఐటీ రిటర్న్స్‌లో దాన్ని చూపించారా? ఒకవేళ చంద్రబాబుకు గెస్ట్‌ హౌస్‌ను ఉచితంగా ఇచ్చి ఉంటే … చంద్రబాబు, లోకేష్‌లు ఇంటి అద్దె కోసం ప్రభుత్వం నుంచి కోటీ 20 లక్షలు ఎలా డ్రా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ఆర్కే.

లింగమనేని రమేష్ నిర్మించిన రెయిన్ ట్రీ పార్కుకు రహదారి, నీరు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. యజ్ఞాలు, యాగాలు చేసుకోవడానికే గెస్ట్‌ హౌస్ నిర్మించినట్టు లింగమనేని రమేష్ చెప్పడంపైనా ఆర్కే మండిపడ్డారు. మరి ఐదేళ్లు చంద్రబాబు, లోకేష్‌లు ఆ ఇంట్లో యజ్ఞాలు యాగాలు, చెక్క భజనలు చేశారా? అని ప్రశ్నించారు.

సీఎంకు రాసే లేఖను ఇష్టానుసారం రాస్తారా అని మండిపడ్డారు. విజయవాడ- గుంటూరు ప్రాంతంలో ఏడు వెంచర్లు వేశామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. లాభాల కోసం వ్యాపారం చేశారే గానీ… ఏదైనా సమాజం కోసం ఖర్చు పెట్టారా అని లింగమనేనిని ప్రశ్నించారు.

నదికి అడ్డంగా ఇల్లు కట్టుకోవడమే కాకుండా ఇప్పుడు దాన్ని కూలుస్తుంటే సమాజం బాధపడుతోంది అని సమాజంపైకి తన బాధను రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లింగమనేని రమేష్‌కు తోడుగా ముసలాయన రామోజీరావు అండగా వచ్చారన్నారు.

”కూల్చివేత గుండెకోత” అంటూ ఈనాడు పత్రిక హెడ్‌లైన్ పెట్టడాన్ని ప్రశ్నించారు. అక్రమ ఇంటిని కూల్చేస్తుంటే అది గుండె కోత ఎలా అవుతుందని ఈనాడు పత్రిక యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రామోజీరావు తన వయసుకు కూడా మర్యాద లేకుండా చేసుకుంటున్నారని ఆర్కే మండిపడ్డారు.

అనుమతులతో నిర్మాణం చేశామంటున్న లింగమనేని రమేష్‌ ఆ పత్రాలను తీసుకుని చర్చకు రావాలని ఆర్కే సవాల్ చేశారు. తాను అన్ని పరిశీలించానని… లింగమనేని గెస్ట్ హౌస్‌ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో గెస్ట్ హౌజ్‌ను ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని రమేష్ గతంలో చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు తిరిగి అది తన భవనమే అని లేఖ రాయడానికి సిగ్గులేదా అని నిలదీశారు.

2011లో లింగమనేని రమేష్ ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తులోని సంతకానికి, నిన్న ముఖ్యమంత్రికి రాసిన లేఖలోని సంతకానికి పొంతనలేదని ఆర్కే రెండు పత్రాలను చూపించారు. దీన్ని బట్టి ఈ లేఖలు రాసింది ఎవరు అని ఆర్కే ప్రశ్నించారు. రెండు లేఖల్లోని సంతకాలు ఎవరు చేశారన్నది తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.

లింగమనేని పేరుతో చంద్రబాబే ఈ లేఖ రాయించారన్న అనుమానాన్ని ఆర్కే వ్యక్తం చేశారు. తప్పుడు పత్రాలు, పోర్జరీ సంతకాల వ్యవహారంలో లింగమనేనిపై క్రిమినల్ కేసులు కూడా పెడుతామని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి, అక్రమంగా ఇల్లు కట్టుకుని… ఇప్పుడు మాత్రం సమాజం మొత్తం గుండెకోతకు గురవుతోందని ఈనాడు పత్రికను, డబ్బులిస్తే వార్తలు రాసే రాధాకృష్ణను అడ్డుపెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఆర్కే విమర్శించారు.

First Published:  25 Sep 2019 3:56 AM GMT
Next Story