Telugu Global
NEWS

ప్రో-కబడ్డీలీగ్ లో కాసులవర్షం

గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు డబ్బే డబ్బు గ్రామీణ క్రీడ కబడ్డీనే నమ్ముకొన్న క్రీడాకారుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ప్రో-కబడ్డీ లీగ్ వేలం పుణ్యమా అంటూ కబడ్డీ క్రీడాకారులు సైతం కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవన విధానంతో పల్లె ప్రాంతాల నుంచి దూసుకొచ్చిన కబడ్డీ ప్లేయర్లు మెరిసిపోతూ మురిసిపోతున్నారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చివేసిందన్న మాట…దక్షిణాసియా దేశాల గ్రామీణ క్రీడ కబడ్డీనే నమ్ముకొన్న స్టార్ ప్లేయర్లు, ప్రధాన రైడర్లు, డిఫెండర్ల జీవితాలనే ఒక్కసారిగా మార్చివేసింది. ఐదుసంవత్సరాల క్రితం […]

ప్రో-కబడ్డీలీగ్ లో కాసులవర్షం
X
  • గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు డబ్బే డబ్బు

గ్రామీణ క్రీడ కబడ్డీనే నమ్ముకొన్న క్రీడాకారుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ప్రో-కబడ్డీ లీగ్ వేలం పుణ్యమా అంటూ కబడ్డీ క్రీడాకారులు సైతం కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవన విధానంతో పల్లె ప్రాంతాల నుంచి దూసుకొచ్చిన కబడ్డీ ప్లేయర్లు మెరిసిపోతూ మురిసిపోతున్నారు.

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చివేసిందన్న మాట…దక్షిణాసియా దేశాల గ్రామీణ క్రీడ కబడ్డీనే నమ్ముకొన్న స్టార్ ప్లేయర్లు, ప్రధాన రైడర్లు, డిఫెండర్ల జీవితాలనే ఒక్కసారిగా మార్చివేసింది.

ఐదుసంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ గత ఏడు సీజన్లుగా అంతై ఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ గ్రామీణ వాసులను మాత్రమే కాదు.. పట్టణ ప్రాంతాలకు చెందిన క్రీడాభిమానులను సైతం అలరిస్తోంది.

96 నుంచి 288 మంది ప్లేయర్లు…

2014 లో ప్రారంభమైన కబడ్డీ లీగ్ తొలిసీజన్ 96 మంది ఆటగాళ్లతో ప్రారంభమయ్యింది. ప్రస్తుత ఏడవ సీజన్లో వివిధ జట్ల తరపున పోటీపడుతున్న క్రీడాకారుల సంఖ్య రికార్డు స్థాయిలో 288కి చేరింది.

రైడింగ్, బ్లాకింగ్ తో సాగే కబడ్డీలో స్పెషలిస్ట్ రైడర్లు, డిఫెండర్లతో పాటు…ఆల్ రౌండర్లకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఆటగాళ్ల ప్రతిభను బట్టి వేలంలో తగిన ధర పలుకుతూ వస్తోంది.

మూడు నుంచి నాలుగు మాసాలపాటు సాగే లీగ్ లో పాల్గొనే ఆటగాళ్లకు కనీస వేతనం 6 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ వేలం ధర కోటీ 45 లక్షల రూపాయలు పలికిందంటే ఆశ్చర్యపోక తప్పదు.

మహారాష్ట్ర్రలోని మారుమూల గ్రామానికి చెందిన సిద్ధార్ధ దేశాయ్ తన అన్న సూరజ్ తో కలసి కబడ్డీ ఆడుతూ ఉండేవాడు. ప్రో-కబడ్డీలీగ్ పుణ్యమా అంటూ సిద్ధార్థ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది.

లీగ్ 7వ సీజన్ వేలంలో అత్యధికంగా సిద్ధార్థ దేశాయ్ కు మాత్రమే కోటీ 45 లక్షల రూపాయల ధర పలికింది. కబడ్డీ ద్వారా కురుస్తున్న కాసుల వర్షంతో సిద్ధార్థ దేశాయ్ కుటుంబం జీవన విధానమే మారిపోయింది. విలాసవంతమైన కార్లు, ఆడంబరమైన జీవన విధానంతో…కబడ్డీ మే పరమాత్మ హై ..అనుకొనేలా చేస్తున్నారు.

ఒకే ఒక్కడు ప్రదీప్ నర్వాల్…

హర్యానాలోని మారుమూల గ్రామంలో జన్మించిన ప్రదీప్ నర్వాల్…ప్రో-కబడ్డీలీగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. తన రైడింగ్ ప్రతిభతో డబ్బుకు డబ్బు, గుర్తింపుకు గుర్తింపు సంపాదించుకొన్నాడు.

ప్రో-కబడ్డీలీగ్ రెండో సీజన్ ద్వారా అడుగుపెట్టిన ప్రదీప్ నర్వాల్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ కు కెప్టెన్ కమ్ స్టార్ రైడర్ గా సేవలు అందిస్తున్న ప్రదీప్ నర్వాల్ కేవలం కబడ్డీ లీగ్ ద్వారానే ఏడాదికి 70 లక్షల నుంచి 90 లక్షల రూపాయల వరకూ ఆర్జిస్తున్నాడు.

వెయ్యి పాయింట్ల మొనగాడు…

ప్రో-కబడ్డీలీగ్ ట్రిపుల్ విన్నర్ పట్నా పైరేట్స్ సూపర్ రైడర్ ప్రదీప్ నర్వాల్..ప్రస్తుత ఏడో సీజన్లో ఓ అరుదైన, అసాధారణ రికార్డు సాధించాడు.

రైడింగ్ లో వెయ్యి పాయింట్ల మైలు రాయి చేరిన తొలి ప్రో కబడ్డీ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

కేవలం తన రైడింగ్ ప్రతిభతోనే పట్నా పైరేట్స్ జట్టును మూడుసార్లు ప్రో-కబడ్డీ విజేతగా నిలిపిన ప్రదీప్ నర్వాల్..ప్రో-కబడ్డీ 5వ సీజన్లో విశ్వరూపమే ప్రదర్శించాడు.

ఆ సీజన్లో ఏకంగా 369 రైడింగ్ పాయింట్లు సాధించడం ద్వారా అత్యుత్తమ ప్లేయర్ గా నిలిచాడు. ఓ రైడ్ లో 8 పాయింట్లు సాధించిన ఘనత సైతం ప్రదీప్ కే దక్కుతుంది.

కోల్ కతా వేదికగా జరిగిన 7వ సీజన్ లీగ్ మ్యాచ్ లో…తమిళ్ తలైవాస్ తో ముగిసిన మ్యాచ్ లో ప్రదీప్ నర్వాల్ 1000 రైడింగ్ పాయింట్ల మైలురాయిని చేరగలిగాడు.

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పట్నా పైరేట్స్ కు 51-25 పాయింట్ల భారీవిజయం అందించాడు. ప్రదీప్ నర్వాల్ ఒక్కడే 26 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రైడర్ల హవా….

క్రికెట్లో బ్యాట్స్ మన్ కు ఎంత క్రేజు ఉంటుందో…కబడ్డీలో రైడర్లకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. పట్నా పైరేట్స్ కు ప్రదీప్ నర్వాల్ ,
దబాంగ్ ఢిల్లీ కి నవీన్ కుమార్, బెంగళూరు బుల్స్త్ కు పవన్ కుమార్ షెరావత్, బెంగాల్ వారియర్స్ కు మనిందర్ సింగ్, తెలుగు టైటాన్స్ కు సిద్దార్థ దేశాయ్, తమిళ్ తలైవాస్ కు రాహుల్ చౌదరి, యూ- ముంబా కు అభిషేక్ సింగ్ స్టార్ రైడర్లుగా సేవలు అందిస్తూ, తమతమ జట్ల విజయాలలో ప్రధానపాత్ర వహిస్తున్నారు.

అంతేకాదు…మహారాష్ట్ర్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్ర్రాలలో ప్రో-కబడ్డీ లీగ్ కు విశేష ఆదరణ దక్కుతోంది.

భారత్ లో అత్యంత జనాదరణ పొందుతున్న మొదటి నాలుగు ప్రొఫెషనల్ లీగ్ లలో ప్రోకబడ్డీలీగ్ సైతం నిలవడం విశేషం. ప్రో- కబడ్డీలీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం.. బహుళజాతి వీవో సంస్థ 42 మిలియన్ డాలర్ల భారీమొత్తం చెల్లించిందంటే..కబడ్డీ లీగ్ కు ఉన్న ఆదరణ ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు.

ప్రపంచీకరణతో భారత క్రీడారంగానికి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం స్టార్ స్పోర్ట్స్ ప్రాయోజిత ప్రో-కబడ్డీ లీగ్ మాత్రమే.

First Published:  24 Sep 2019 7:02 PM GMT
Next Story