ఈ తరహా అభివృద్ధి వికేంద్రీకరణ వద్దు… అన్ని ఆఫీసులను అమరావతిలోనే కట్టాలి…

హైదరాబాద్‌ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధిని మొత్తం ఒకే చోట కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాలన్న డిమాండ్ ఉత్తరాంధ్ర, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి బలంగా ఉంది.

గతంలో అభివృద్ధిని మొత్తం హైదరాబాద్‌లోనే కేంద్రీకరించడం వల్ల విభజన సమయంలో ఏపీ ఉత్తి చేతులతో మిగిలిపోయిందన్న భావన కూడా గట్టిగా ఉంది.

ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్…. రాష్ట్ర విభజన తర్వాత ఈ అంశాన్ని పదేపదే అనేక వేదికల మీద ప్రస్తావించాడు. ఆంధ్రా ముఖ్యమంత్రులు అభివృద్ధిని మొత్తం హైదరాబాద్‌కు పరిమితం చేయడం వల్లే ఇప్పుడు ఏపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పేవాడు. కొత్త రాష్ట్రంలోనైనా అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలని గతంలో సూచించాడు.

అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ ఆలోచన విధానాన్ని మాత్రం ఆయన ఇప్పుడు వ్యతిరేకించాడు. అన్ని ప్రధాన కార్యాలయాలను అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు.

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప వేదికగా పలు శాఖల ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న కొత్త ప్రభుత్వ ఆలోచనను చలసాని తప్పుపట్టాడు. నాలుగు చోట్ల కార్యాలయ ఏర్పాటును వ్యతిరేకించాడు. అన్నింటిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు.

అక్టోబర్ 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రికి రాసిన లేఖలో చలసాని డిమాండ్ చేశాడు.