చింతమనేని ఇప్పట్లో బయటకు రారా?.. కోర్టు వద్దే పోలీసులపై బూతు పురాణం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పరిస్థితి చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినా, టీడీపీ అధికారం కోల్పోయినా సరే ఇప్పటికీ తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.

టీడీపీ హయాంలో పోలీసులపై దాడి చేసినా, వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టినా చంద్రబాబు అండతో తనపై ఈగ కూడా వాలకుండా చింతమనేని చూసుకోగలిగాడు. కానీ ప్రభుత్వం మారడం, ఆ తర్వాత కూడా చింతమనేని దౌర్జన్యాలు కొనసాగాయి. దాంతో ఆ మధ్య అట్రాసిటీ కేసులో చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అప్పటికే చింతమనేనిపై 49 కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసే సమయంలో బందోబస్తుకు వచ్చిన ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరుల సాయంతో ఒక గదిలో బంధించాడు చింతమనేని. దానిపైనా కేసు నమోదు అయింది. తొలుత అట్రాసిటీ కేసులో అరెస్ట్ కాగా కోర్టు చింతమనేనికి రిమాండ్ విధించింది. ఈ కేసులో రిమాండ్‌ ముగియకముందే మరో కేసులో చింతమనేనిని పీటీ వారెంట్‌పై పోలీసులు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

ఆ కేసులో రిమాండ్‌ బుధవారంతో ముగుస్తుండగా…పోలీసులు మరో రెండు కేసుల్లో పీటీ వారెంట్‌ మీద జైలు నుంచి చింతమనేనిని తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. దాంతో అక్టోబర్ 10 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో చింతమనేని పోలీసులను యదేచ్చగా నోటికొచ్చినట్టు బూతులు తిట్టాడు. కోర్టు ఆవరణలో కూడా అసభ్యకరంగా పోలీసులను దూషించాడు.

కోర్టులోపలికి తీసుకెళ్తున్న సమయంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్ ఒకరు తన చేయి పట్టుకోవడంపై చింతమనేని ఊగిపోయారు. నా చేయే పట్టుకుంటావా అంటూ సదరు పోలీసు అధికారిని తోటి పోలీసుల ముందే తిట్టేశాడు చింతమనేని. దాంతో పోలీసులను దూషించిన వ్యవహారంలోనూ చింతమనేనిపై కేసు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.