నన్ను ఓడించారు… నా తమ్ముడినీ ఓడించారు

సున్నిత మనస్తత్వం ఉన్న వారు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని సూచించారు హీరో చిరంజీవి. ఒక మేగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిరంజీవి… రజనీ కాంత్‌, కమల్‌ హసన్‌ సున్నిత మనస్తత్వంతో ఉంటే రాజకీయాల్లోకి రావద్దు అని సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చాక చాలా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

చిత్రపరిశ్రమలో నెంబర్‌ వన్‌గా ఉన్న సమయంలోనే ప్రజలకు సేవ చేయాలని తాను రాజకీయాల్లోకి వచ్చానని చిరు చెప్పారు. కానీ రాజకీయం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతోందన్నారు. కోట్లాది రూపాయలను వినియోగించి తనను సొంత నియోజకవర్గంలోనే ఓడించారని చిరంజీవి చెప్పారు. తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌కు కూడా అదే అనుభవం ఎదురైందని వివరించారు.

రాజకీయాల్లో కొనసాగాలంటే ఓటమి, అవమానాలు, అసంతృప్తి ఇలా అన్నింటికి సిద్ధపడి ఉండాలన్నారు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ దృఢ సంకల్పంతో రాజకీయాల్లో కొనసాగాలని నిశ్చయించుకుంటే.. అన్ని సవాళ్లను, అసంతృప్తులను ఎదుర్కొని నిలబడాలని సూచించారు. సున్నిత మనస్తత్వం ఉంటే మాత్రం రాకపోవడమే మంచిదని చిరంజీవి సలహా ఇచ్చారు.

2009 ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. పాలకొల్లులో ఓడిపోయారు. తిరుపతిలో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ భీమవరం, గాజువాకలో పోటీ చేశారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టలేకపోయారు.