గద్దలకొండ గణేష్ మొదటి వారం వసూళ్లు

మొదటి వారం గద్దలకొండ గణేష్ మెరిసింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ, నైజాంలో కలిపి ఈ సినిమాను 20 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి వారంలోనే 17 కోట్లకు పైగా షేర్ అంటే అది చెప్పుకోదగ్గ విశేషమే. కాకపోతే మిగతా ఎమౌంట్ కూడా రాబట్టి, ఇది బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది పెద్ద డౌట్. ఎందుకంటే, అట్నుంచి సైరా సినిమా తరుముకొస్తోంది.

సరిగ్గా 5 రోజుల్లో సైరా సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ 5 రోజుల్లోనే అదనంగా 4 కోట్ల రూపాయలు రావాలి. పైగా, ఈ సినిమాకు ఉన్నది ఈ శని, ఆదివారాలు మాత్రమే. 4 కోట్లలో అత్యధిక మొత్తం ఈ 2 రోజుల్లోనే రావాలి. అందుకే గద్దలకొండ గణేష్ బ్రేక్-ఈవెన్ పై అందరికీ అనుమానాలు పెరుగుతున్నాయి.

లక్కీగా ఈ వీకెండ్ వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఇంకా చెప్పాలంటే అన్నీ చిన్న సినిమాలు, పైగా ఫ్లాప్ అయిన మూవీస్. కాబట్టి ఉన్నంతలో గద్దలకొండ గణేష్ కు అంతోఇంతో వసూళ్లు రావడం ఖాయం. కానీ 4 కోట్ల రేంజ్ లో వసూళ్లు వస్తాయా అనేది డౌట్.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా డిజాస్టర్ అయింది. కేవలం 3లక్షల 80వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. సో.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా జాతకం ఏంటనేది శని, ఆదివారాల వసూళ్లతో తేలిపోతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 6.15 కోట్లు
సీడెడ్ – రూ. 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.10 కోట్లు
ఈస్ట్ – రూ. 1.25 కోట్లు
వెస్ట్ – రూ. 1.22 కోట్లు
గుంటూరు – రూ. 1.49 కోట్లు
నెల్లూరు – రూ. 0.73 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు