పాక్ గడ్డపై పదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్

  • శ్రీలంకతో వన్డే సమరానికి కరాచీ ముస్తాబు

ఉగ్రవాదుల అడ్డా పాక్ గడ్డపై దశాబ్దకాలం తర్వాత… తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు రంగం సిద్ధమయ్యింది. శ్రీలంకతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా శుక్రవారం తొలి సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

2009లో చివరిసారిగా వన్డే మ్యాచ్…

పాకిస్థాన్ గడ్డపై చిట్టచివరి వన్డే మ్యాచ్ 2009లో నిర్వహించారు. అప్పట్లో లాహోర్ వేదికగా పాక్- శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగటానికి ముందే… ఉగ్రవాదుల బాంబుదాడితో.. లంక జట్టు తన పర్యటనను అర్థంతరంగా రద్దు చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చింది.

ఆ తర్వాత నుంచి పాక్ గడ్డపై జరిగే సిరీస్ లకు హాజరుకాబోమని టెస్ట్ హోదా పొందిన దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.

దీంతో …షార్జా, దుబాయ్, అబుదాబీ తటస్థ వేదికలుగా పాక్ జట్టు తన అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లు ఆడుతూ వస్తోంది.
పాక్ జట్టు విదేశీగడ్డపై స్వదేశీ సిరీస్ లు ఆడుతూ రావడంతో పాక్ క్రికెట్ బోర్డు వందల కోట్ల రూపాయల నష్టాలతో దివాళా తీసే పరిస్థితికి చేరుకొంది.

ఈ పరిస్థితి నుంచి బయటపడటం కోసం… పాక్ క్రికెట్ బోర్డు జింబాబ్వే ను ఆహ్వానించి టీ-20 మ్యాచ్ నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. 

ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా… 

పాక్ మాజీకెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడంతో…పాక్ గడ్డపై ఆరునూరైనా అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే.. శ్రీలంకజట్టును వన్డే, టీ-20 సిరీస్ లు ఆడటానికి పాక్ బోర్డు ఆహ్వానించింది.

తీన్మార్ వన్డేసిరీస్ కు కరాచీ, తీన్మార్ టీ-20 సిరీస్ కు లాహోర్ స్టేడియాలు వేదికలుగా నిలిచాయి. వన్డే సిరీస్ లోని రెండు, మూడు వన్డేలను కరాచీ వేదికగానే ఆది, బుధవారాలలో నిర్వహిస్తారు.

 

అక్టోబర్ 5, 7, 9 తేదీలలో లాహోరు వేదికగా టీ-20 సిరీస్ జరుగుతుంది.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు…

గత పదేళ్లలో తమ గడ్డపై తొలిసారిగా జరుగుతున్న వన్డే అంతర్జాతీయ సిరీస్ కోసం పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భయంభయంగా తమ దేశానికి వచ్చిన శ్రీలంక క్రికెటర్లకు…దేశాధినేతలకు కల్పించే భద్రతను ఏర్పాటు చేశారు.

2వేల మంది భద్రత దళాలు…రంగంలోకి దిగి..శ్రీలంక క్రికెటర్లను కంటికి రెప్పలా కాపాడుకొంటూ వస్తున్నాయి.

8 మంది అగ్రశ్రేణి క్రికెటర్ల డుమ్మా…

పాకిస్థాన్ లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టు నుంచి కెప్టెన్, ఇద్దరు మాజీ కెప్టెన్లతో సహా మొత్తం ఎనిమిది మంది సీనియర్ క్రికెటర్లు ఉపసంహరించుకొన్నారు. దీంతో..లాహిరు తిరుమనేకు శ్రీలంక జట్టు పగ్గాలు అప్పచెప్పారు.