స్కూల్ ఫీజు కోసం విసిగించిందని కూతుర్ని చంపేశాడు

హర్యానాలో ఓ తండ్రి 6 ఏళ్ల తన కుమార్తెను పాఠశాల ఫీజు చెల్లించమని విసిగిస్తున్నదని చెప్పి గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుని భార్య హర్జిందర్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దబ్ఖేరా గ్రామ నివాసి జస్బీర్ సింగ్ పై గురువారం హత్య కేసు నమోదైందని ఎస్‌హెచ్‌ఓ, లాడ్వా ఇన్‌స్పెక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు.

రోజువారీ పొలం పనులు చేసుకుని బతికే జస్బీర్ సింగ్ తన ఏకైక బిడ్డ సుమిత్‌ను బుధవారం రాత్రి చంపాడని కౌర్ పోలీసులకు చెప్పింది.

తమ కుమార్తె పాఠశాల ఫీజు చెల్లించమని అడిగినప్పుడల్లా తన భర్త చిరాకు పడేవాడని హర్జిందర్ కౌర్ తెలియజేసింది.

హత్య ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియదని, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపింది.

ఒకపక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన “బేటీ బచావో బేటి పఢావో” నినాదం దేశమంతా ఆర్భాటంగా మార్మోగుతున్న తరుణం లో ఓ చిట్టి తల్లికి ఫీజు కట్టలేని తండ్రి కన్న కూతుర్ని చంపుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?