వృద్ధాప్య పించన్‌కు చిల్లర నోట్ల మూటలు

ఏపీ ప్రభుత్వం నెలనెలా పంపిణీ చేస్తున్న వృద్ధాప్య పించన్ల పట్ల రాష్ట్రంలో పలు బ్యాంకుల అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. తమ వద్ద ఉండిపోయిన చిన్ననోట్లను, నలిగిపోయి, కొద్దిగా చినిగిన నోట్లను పించన్లకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ భరోసా కింద 11 రకాల పించన్లు ఇస్తోంది. ఇందుకు అవసరమైన డబ్బును డ్రా చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు నెలనెలా బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు.

పించన్‌ సొమ్మును డ్రా చేసేందుకు వచ్చారని తెలియగానే బ్యాంకు అధికారులు వారి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 10, 20, 50, 100 రూపాయల నోట్లను కట్టబెడుతున్నారు. అది కూడా బ్యాంక్‌ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత చిన్ననోట్లను, మెత్తబడ్డ నోట్లను మూటలు మూటలుగా తమకు అప్పగిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.

గుంటూరు జిల్లాలో పలు బ్యాంకులు ఇదే పనిచేస్తున్నాయి. వృద్ధాప్య పించన్ డబ్బుల కోసం వస్తే తమను బ్యాంకులు చిన్నచూపు చూస్తున్నాయని నిహారిక అనే పంచాయతీ సెక్రటరీ వాపోయారు. తాము మధ్యాహ్నమే బ్యాంకుకు వచ్చినా సాయంత్రం తర్వాతే నగదు ఇస్తున్నారని.. అది కూడా చినిగిన చిన్న నోట్లను ఇస్తున్నారని అంత డబ్బును రాత్రి వేళల్లో తీసుకెళ్లడం తమకు ఇబ్బంది అవుతోందని ఆమె వివరించారు. కొన్ని గ్రామాలకు 20 లక్షల వరకు డ్రా చేయాల్సి వస్తోందని అంత సొమ్ముతో వెళ్లడం వల్ల భద్రతకు ఇబ్బందిగా ఉందని వివరించారు.

తాడికొండ నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులది ఇదే పరిస్థితి. చిన్న నోట్లను గోనెసంచుల్లో వేసుకుని (పించన్ డబ్బును) తరలిస్తున్నారు. 10,20,50,100 నోట్లను మాత్రమే బ్యాంకులు ఇస్తున్నాయని… వృద్ధులకు కూడా ఈజీగా ఉంటుందని కాబట్టి 500, 2000 నోట్లు ఇవ్వాల్సిందిగా అడిగితే బ్యాంకు అధికారులు కుదరదని చెబుతున్నారని కార్యదర్శులు వివరించారు.

ఈ డబ్బును తీసుకెళ్లి జాగ్రత్తపరచడం కూడా తమకు ఇబ్బంది అవుతోందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.