పాక్ గడ్డపై పదేళ్ల తర్వాత వన్డేకి వానదెబ్బ

  • భారీవర్షంతో ఈత కొలనుగా మారిన కరాచీ స్టేడియం
  • 30వ తేదీకి రెండో వన్డే వాయిదా…

ఉగ్రవాదుల దెబ్బతో గత పదేళ్లుగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వలేకపోతున్న పాక్ క్రికెట్ బోర్డు కు మరోసారి నిరాశ తప్పలేదు.

ప్రతికూల పరిస్థితుల నడుమ శ్రీలంక బోర్డును ఒప్పించి…తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ లకు రంగం సిద్ధం చేసుకొన్న పాకిస్థాన్ కు వరుణదేవుడు సైతం అనుకూలించలేదు.

కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా జరగాల్సిన తొలివన్డే మ్యాచ్ భారీ వర్షంతో రద్దయ్యింది. రుతుపవనాల ప్రభావంతో కుండపోతగా వానపడడంతో… మ్యాచ్ వేదిక ఈత కొలనుగా మారిపోయింది.

మ్యాచ్ కోసం దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వందలాదిమంది అభిమానులు..వానదెబ్బతో తీవ్ర నిరాశకు గురికాక తప్పలేదు. క్రికెట్ గ్రౌండ్ కాస్త నీటిమడుగులా మారిపోడంతో… రెండుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లకే పరిమితం కావాల్సి వచ్చింది.

దీంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోడంతో…రద్దు చేసినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

అంతేకాదు…ఈనెల 29న జరగాల్సిన రెండోవన్డేను సైతం 30వ తేదీకి వాయిదా వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
అవుట్ ఫీల్డ్ ను మ్యాచ్ కు అనువుగా తయారు చేయడం కోసం గ్రౌండ్ సిబ్బందికి ఓ రోజును అదనంగా ఇవ్వడం కోసం..29న జరగాల్సిన రెండోవన్డేను 30న నిర్వహించాలని నిర్ణయించారు.

తీన్మార్ వన్డే సిరీస్ కు కరాచీ నేషనల్ స్టేడియం, మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు లాహోర్ గడ్డాఫీ స్టేడియం ఆతిథ్యమిస్తున్నాయి.