సాకులు వెతికి సాగనంపారు – యువరాజ్‌ సంచలన వ్యాఖ్యలు

ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్ సింగ్… తన రిటైర్మెంట్‌ వెనుక అసలు విషయాలను ఎట్టకేలకు బయటపెట్టారు. మేనేజ్‌మెంట్‌ పరోక్షంగా తనను క్రికెట్‌కు దూరమయ్యేలా చేసిందని చెప్పారు. తాను ప్రతిభ ఆధారంగానే నిలబడ్డానని…. చాలా సార్లు మేనేజ్‌మెంట్‌ తనకు అండగా నిలబడలేదని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సీనియర్‌ను అయిన తనపై సాకులు వెతికి వేటు వేశారని ఆవేదన చెందారు. తనతో పాటు సెహ్వాగ్, జహీర్‌ ఖాన్ విషయంలోనూ మేనేజ్‌మెంట్‌ ఇదే తరహాలో వ్యవహరించిందని విమర్శించారు.

మేనేజ్‌మెంట్‌ తనకు అండగా ఉండి… సరైన సమయంలో అవకాశం ఇచ్చి ఉంటే మరో వరల్డ్ కప్‌ కూడా ఆడి ఉండేవాడినని వ్యాఖ్యానించారు. మేనేజ్‌మెంట్ అండగా నిలబడి ఉంటే ఇంత త్వరగా తాను రిటైర్మెంట్ ప్రకటించే వాడిని కాదన్నారు. తనకు గాడ్ ఫాదర్స్ లేకపోవడం కూడా దెబ్బతీసిందన్నారు. 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత జరిగిన 8 మ్యాచ్‌ లలో రెండుసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచానని గుర్తు చేశారు.

ఆ సమయంలోనే గాయమైందన్నారు. గాయం తర్వాత శ్రీలంక టూర్‌కు సిద్ధంగా ఉండాలని మేనేజ్‌మెంట్‌ చెప్పిందని… కానీ అంతలోనే యో-యో పరీక్షలో పాల్గొనాలని సూచించిందన్నారు. 36 ఏళ్ల వయసులోనూ ఆ టెస్ట్‌ను తాను పాస్ అయ్యానని… అలా 36 ఏళ్ల వయసులో తాను ఆ టెస్ట్‌ను పాస్ అవుతానని బహుశా మేనేజ్‌మెంట్ ఊహించి ఉండకపోవచ్చని యువరాజ్ వ్యాఖ్యానించారు. యో-యో టెస్ట్ పాస్‌ అయిన తర్వాత కూడా ఏవేవో సాకులు చెప్పి జట్టులోకి ఎంపిక చేయకుండా వేటు వేశారని యువరాజ్ సింగ్ ఆరోపించారు.

15 ఏళ్ల పాటు దేశం తరపున ఆడిన సీనియర్‌ను తానని… తనను తప్పించాలనుకుంటే కూర్చోబెట్టి ఫలాన కారణాల వల్ల జట్టులోకి తీసుకోలేకపోతున్నామని చెప్పాల్సిందన్నారు. కానీ అలా చేయకపోవడం బాధకలిగించిందన్నారు. సీనియర్ ఆటగాళ్లు సెహ్వాగ్, జహీర్‌ఖాన్‌ పట్ల కూడా ఇదే తరహాలో వ్యవహరించారని.. కనీసం కారణాలు చెప్పకుండా తప్పించారని యువరాజ్ విమర్శించారు.