రాజుని బట్టే ప్రకృతి సహకరిస్తుంది…. అందుకే బాబు జమానాలో వర్షాలు లేవు

“ప్రకృతైనా, దేవుడైనా పాలించే రాజును బట్టే తమ సాయం, సహకారం అందజేస్తాయి. సమైక్య రాష్ట్రంలోనైనా, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లోనైనా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రకృతి సహకరించ లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తూ గడిపారు” అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఓ సామాజిక వర్గానికి తప్ప… ప్రకృతికి, దేవుడికి అసలు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రకృతి పరవశించి భారీ వర్షాలు కురిసాయి అని ఆయన అన్నారు.

“వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి” అని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

కరకట్ట మధ్యలో ఉన్నఇంట్లో నివాసం ఉన్న చంద్రబాబు నాయుడు భారీ వర్షాల కారణంగా తన ఇంట్లోకి నీళ్ళు వచ్చాయంటున్నారని, ఇది ప్రభుత్వ తప్పిదమని విమర్శిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.

“చంద్రబాబు గారూ.. కృష్ణానది కరకట్ట మధ్యలో ఉన్ననివాసంలో అద్దెకు ఉన్నది మీరు. అది అక్రమ కట్టడం అని మీకు తెలియదా..? కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరితే మీ నివాసానికి ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పలేదా..? మీరు తప్పు చేసి ప్రభుత్వం మీద నిందలు వేస్తారా. ఇదా మీ నీచ రాజకీయం” అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజా క్షేమమే పరమావధిగా పని చేస్తున్నారని, ఇది చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కంటిగింపుగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.

ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి బుగ్గన తెలిపారు.