టీ-20 క్రికెట్లో ఒకేరోజున రెండు ప్రపంచ రికార్డులు

  • పురుషుల టీ-20లో నేపాల్ కెప్టెన్ రికార్డు
  • మహిళల టీ-20లో శ్రీలంక కెప్టెన్ రికార్డు

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో…ఒకేరోజున పురుషుల, మహిళల విభాగాలలో జంట ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. సింగపూర్ వేదికగా సింగపూర్ జట్టుతో ముగిసిన ముక్కోణపు సిరీస్ మ్యాచ్ లో నేపాల్ కెప్టెన్ పారస్ కడ్కే, సిడ్నీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టీ-20 సిరీస్ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ చమారీ అటపట్టు సెంచరీలు బాదడం ద్వారా ప్రపంచ రికార్డులు నమోదు చేశారు.

తొలి కెప్టెన్ పారస్….

టీ-20 క్రికెట్లో చేజింగ్ కు దిగిన సమయంలో సెంచరీ సాధించిన కెప్టెన్ గా నేపాల్ సారథి పారస్ కడ్కే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

సింగపూర్ లోని ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్స్ వేదికగా సింగపూర్ తో జరిగిన టీ-20 మ్యాచ్ లో…152 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో.. పారస్ ప్రధానపాత్ర వహించాడు.

ఆల్ రౌండర్ కమ్ నేపాల్ స్టార్ క్రికెటర్ పారస్ కేవలం 52 బాల్స్ లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ కెప్టెన్ సెంచరీలో..7 బౌండ్రీలు, 9సిక్సర్లు ఉన్నాయి.

తనజట్టుకు 9 వికెట్ల విజయం అందించడం ద్వారా పారస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఐదుగురి సరసన పారస్…

టీ-20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్ హోదాలో సెంచరీలు బాదిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ, ఆరోన్ ఫించ్, ఫాబ్ డూప్లెసీ, షేన్ వాట్సన్, తిలకరత్నే దిల్షాన్ ఉన్నారు.

వీరంతా…. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలోనే సెంచరీలు సాధించడం విశేషం.

అయితే… చేజింగ్ కు దిగిన సమయంలో సెంచరీ సాధించిన ఏకైక, తొలి కెప్టెన్ ఘనతను మాత్రం పారస్ కడ్కే సొంతం చేసుకొన్నాడు. క్రికెట్ పసికూన నేపాల్ సైతం.. క్రికెట్ ప్రపంచ రికార్డుల్లో తన పేరును లిఖించుకోగలిగింది.

వీరబాదుడు చమారీ…

మహిళా క్రికెట్లో వీరబాదుడు ప్లేయర్ గా శ్రీలంక ఓపెనర్ చమారీ అటపట్టుకు పేరుంది. వన్డే క్రికెట్లో ఇప్పటికే మెరుపు సెంచరీ సాధించిన చమారీ… ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తన బ్యాట్ పదును ఏపాటిదో ఆస్ట్ర్రేలియాకు రుచి చూపించింది.

ఆస్ట్ర్రేలియాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో…218 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన శ్రీలంకకు.. ఓపెనర్ కమ్ కెప్టెన్ చమారీ అటపట్టు..కేవలం 66 బాల్స్ లోనే 113 పరుగులతో మెరుపు సెంచరీ అందించినా పరాజయం తప్పలేదు.

అయితే…టీ-20 చేజింగ్ లో శతకం బాదిన మహిళా తొలి కెప్టెన్ ఘనతను చమారీ సొంతం చేసుకోగలిగింది.

చమారీ శతకంలో 12 బౌండ్రీలు, 6 సిక్సర్లు ఉన్నాయి. చమారీ బాదిన ఓ సిక్సర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఉత్తర భాగంలోని రూఫ్ బయట పడటం విశేషం.

నేపాల్ కెప్టెన్ పారస్ కడ్కే సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందిస్తే…చమారీ శతకం సాధించినా శ్రీలంకకు మాత్రం 41 పరుగుల ఓటమి తప్పలేదు.