కాలుష్యానికి గురైతే మానసిక సమస్యలు వస్తాయట

చిన్నతనం లో వాయు కాలుష్యానికి గురికావడం… కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది.

ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పెర్స్పెక్టివ్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం, పరిసర వాయు కాలుష్యానికి స్వల్పకాలం గురైనా… ఒకటి నుండి రెండు రోజుల తరువాత పిల్లలలో మానసిక రుగ్మతలు తీవ్రమవుతాయని కనుగొన్నారు.

అమెరికాలోని సిన్సినాటి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన పరిశోధనలో విస్మరించ రాని నిజాలు బయట పడ్డాయి.

“రోజువారీ బహిరంగ వాయు కాలుష్య స్థాయిల వల్ల పిల్లలలో ఆందోళన, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలగడం వంటి మానసిక రుగ్మతల లక్షణాలు కలగటానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపించిన మొదటి అధ్యయనమిది” అని సిన్సినాటి చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ కు చెందిన కోల్ బ్రోకాంప్ చెప్పారు.

పేదరికం అధికంగా ఉన్న పరిసరాల్లో నివసిస్తున్న పిల్లలు వాయు కాలుష్యం వల్ల ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారట. కాలుష్యం, పొరుగువారి ఒత్తిళ్లు మనసు పై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తాయి.

పిల్లల మానసిక ఆరోగ్యానికి, వాయు కాలుష్యానికి ఉన్న లింక్ కి సంబంధించిన మరో రెండు సిన్సినాటి అధ్యయనాలు కూడా ఇటీవల ప్రచురితమయ్యాయి.

మొత్తం మూడు అధ్యయనాలనూ సమిష్టిగా చూసినప్పుడు… ప్రారంభ జీవితం వాయు కాలుష్యానికి గురికావడం వల్ల కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని సిన్సినాటి పరిశోధకుడు పాట్రిక్ ర్యాన్ అన్నారు.