అది బోటా? బండరాయా?

గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ధర్మాడి సత్యం బృందం సోమవారం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు వరకు గాలింపు చేశారు.

అయితే బోటు ఆచూకీ స్పష్టంగా తెలియలేదు. ఉదయం గోదావరికి పూజలు నిర్వహించి గాలింపు కార్యక్రమం మొదలుపెట్టారు. గోదావరికి వరద కొద్దిమేర తగ్గడంతో సుడులు కూడా తగ్గాయి. దాంతో గాలింపుకు కొద్దిమేర అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

బోటు ఉన్నట్టు భావిస్తున్న ప్రాంతంలో ఐరన్ రోప్‌ను జారవిడిచి గాలించారు. ఒక దశలో అది తెగిపోయింది. దాంతో మరోసారి ప్రయత్నించగా ఒక బలమైన వస్తువు దానికి చిక్కింది. దాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

అంతలో చీకటి పడడంతో విరామం ఇచ్చారు. రోప్‌కు తగిలింది బోటేనా? లేక బండరాయా అన్నది తేలడం లేదు. నేడు ఆ విషయంలో స్పష్టత రానుంది.