గ్రామ వాలంటీర్లు మీ పెద్ద కొడుకులా సేవ చేస్తారు

రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ సేవల కోసం కూడా సామాన్యుడు గ్రామ స్థాయి అధికారుల నుంచి కలెక్టరేట్ వరకు తిరుగుతున్న పరిస్థితులను పాదయాత్రలో తాను గమనించానన్నారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో గ్రామాల్లో పాలన కనిపించలేదన్నారు. అందుకే పాదయాత్ర సమయంలోనే గ్రామ సచివాలయాల ద్వారా పాలనను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 13వేల 610 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ వాలంటీర్లు మరో 30వేల మంది ఉన్నారన్నారు. ఒక్క జిల్లాలోనే నాలుగు నెలల్లోనే 44వేల 198 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. రెండు నెలల్లోనే గ్రామ సచివాలయాల్లో కంప్యూటర్లు, ఇతర పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. జనవరి ఒకటి నుంచి పూర్తిగా గ్రామ సచివాలయాలు సేవలు అందిస్తాయన్నారు.

ప్రతి వాలంటీర్ పెద్ద కొడుకుగా ఆయా కుటుంబాలకు సేవలందిస్తారని జగన్‌ చెప్పారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయం కలిసి అవినీతి లేని పాలన ప్రజలకు అందిస్తారన్నారు. రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా లంచం, ఇంటి స్థలం కావాలన్నా లంచం, ఫించన్ కావాలన్నా లంచం, ఇల్లు కావాలన్నా లంచం, మరుగుదొడ్లు కావాలన్నా లంచం గతంలో ఇవ్వాల్సి వచ్చేదన్నారు. మీరు ఏ పార్టీ అని ప్రశ్నించిన తర్వాతే జన్మభూమి కమిటీలు ప్రజలకు పథకాలు అందించాయన్నారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఏ సేవ కావాలన్నా ఉచితంగా నేరుగా 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు.

రేషన్ కార్డు, పించన్, ఆరోగ్య శ్రీ, ఇంటి పట్టా, పొదుపు పథకం, తాగునీటి సరఫరా, వైద్యం, రెవెన్యూ, భూముల సర్వే, మార్కెటింగ్, డైరీ, పౌల్ట్రీ, వ్యవసాయానికి సంబంధించిన సేవలన్నీ కూడా గ్రామ సచివాలయాల ద్వారానే అందిస్తామన్నారు. గ్రామ సచివాలయం పక్కనే ప్రత్యేకంగా షాపు ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు అందిస్తామన్నారు. గ్రామ సచివాలయాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని జగన్‌ కోరారు.

ప్రజల మీద అధికారం చెలాయించడం కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయలేదని… సేవ చేసేందుకు ఏర్పాటు చేశామన్న విషయం ఉద్యోగులు గుర్తించాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పు ఇప్పుడు జరగకూడదన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో ఎవరైనా వివక్ష చూపినా, అవినీతి చేసినా 1902 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. కానీ అలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికైన ఉద్యోగులపై ఉందన్నారు.

మూడేళ్లలో రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితులను పూర్తిగా మార్చేస్తామన్నారు. మార్పుకు ముందు, మార్పుకు తర్వాత స్కూళ్ల ఫొటోలను తీసి ‘నాడు-నేడు’ అని ప్రదర్శిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా మార్చేస్తామన్నారు. అమ్మ ఒడి పథకం కింద నిరక్షరాస్యతను పూర్తిగా మాయం చేస్తామన్నారు. ఐదేళ్ల తర్వాత నిరక్షరాస్యత అన్నది రాష్ట్రంలో కనిపించకుండా చేస్తామన్నారు. రాష్ట్రంలో 43వేల బెల్ట్‌ షాపులను రద్దు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తిరిగి బెల్ట్‌ షాపులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వమే మద్యం షాపులను ఏర్పాటు చేసిందన్నారు.

ప్రైవేట్ వ్యక్తులకు షాపులు అప్పగిస్తే వారు బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వమే షాపులను ఏర్పాటు చేసిందన్నారు. 20 శాతం షాపులను కూడా తగ్గించామన్నారు.

మద్యం షాపు పక్కనే పర్మిట్‌ రూములు ఉండేవని… అక్కడే తాగుతూ ఉండేవారని… దాని వల్ల మహిళలు అటుగా వెళ్లాలంటే భయపడేవారన్నారు. కానీ ఇప్పుడు పర్మిట్‌ రూములను ఎత్తివేశామన్నారు.

గతంలో అర్థరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉండేవన్నారు. కానీ ఇకపై షాపు తెరవడమే ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకే మూసివేస్తున్నట్టు చెప్పారు. గ్రామ సచివాలయాల్లో నియమించిన మహిళా పోలీస్‌ ల ప్రధాన బాధ్యత గ్రామాల్లో బెల్ట్‌ షాపులు రాకుండా చూడడమేనన్నారు. ప్రజలకు సంబంధించిన విద్యా, వైద్యం విషయంలో ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు.