నష్ట నివారణ కోసమే కాశ్మీర్ పై ఆంక్షలు

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని భారత్ మరోసారి గట్టిగా వినిపించింది. వాషింగ్టన్‌ వేదికగా విదేశాంగ విధానంపై జరిగిన సదస్సులో ప్రసంగించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌… భారత్‌కు చోటు లేని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి విశ్వసనీయత మనజాలదని అభిప్రాయపడ్డారు. భారత్‌కు స్థానం కల్పించని పక్షంలో మండలి విశ్వసనీయతపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా… అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉద్భవిస్తున్న భారత్‌కు భద్రతా మండలిలో స్థానం ఉండాలని కోరారు. సభ్య దేశాలను విస్మరించడం వల్ల గడిచిన 15ఏళ్లలో అనేక అంతర్జాతీయ సంస్థలు నిర్వీర్యం అయిన విషయాన్ని కూడా గుర్తించుకోవాలన్నారు. ఆర్ధికంగా అండగా ఉంటున్న దేశాలకు సభ్యత్వం కల్పిస్తూనే… ఇతర కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్‌ లాంటి దేశాలకు కూడా సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని జైశంకర్ వాదించారు.

రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో భారత్ వెనక్కు తగ్గబోదని స్పష్టం చేశారాయన. సరిహద్దుల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎస్‌-400 క్షిపణులు భారత్‌కు చాలా అవసరమన్నారు. ఈ క్షిపణుల కొనుగోలు అంశంలో భారత్‌ అవసరాలను అమెరికా అర్థం చేసుకుంటుందనే తాము భావిస్తున్నట్టు చెప్పారు.

కశ్మీర్‌లో ఇప్పటికీ అంక్షలు అమలు చేయడాన్ని కూడా ఆయన సమర్ధించుకున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం నివారణ కోసమే కశ్మీర్‌లో ఆంక్షలు విధించామని చెప్పారు. గతంలో మొబైల్ సేవలు దుర్వినియోగం అయ్యాయని… అందుకే ఈసారి ఆ పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్తపడుతున్నట్టు వివరించారు. కశ్మీర్‌ ప్రజలపై వీలైనంత త్వరగా ఆంక్షలు ఎత్తివేయాలని ఇటీవల అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.