తనపై విమర్శలకు త్వరలో సమాధానం చెప్పనున్న లోకేష్

లక్ష్మీపార్వతి విమర్శలు బాగా పనిచేసినట్టున్నాయి. ట్విట్టర్ లో మాత్రమే కూసే కొడుకును కన్నావ్ చంద్రబాబు అని మొన్న లక్ష్మీపార్వతి ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో టీడీపీ అధ్యక్షుడయ్యే నేత ఎట్టకేలకు విలేకరులను డైరెక్ట్ గా ఎదుర్కొనేందుకు మీడియా ముందుకు రాబోతున్నాడు. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు విలేకరులకు కబురు పంపారు.

టీడీపీ భావి నాయకుడు.. నడిపించే నేత ఇలా మీడియా ముందు భయపడడం ఏంటని తెగ ప్రిపేర్ అయిపోయినట్టు ఉన్నారు. తాజాగా చంద్రబాబు తన తనయుడి కోసం మరోసారి ప్రైవేటు పాఠాలు చెప్పిస్తున్నారట. ఈనాడు మూలాలున్న ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు, మరో ఇద్దరు మెరుగైన భాషా పండితులు మొత్తం నలుగురు లోకేష్ కు ఈ మేరకు భాషపై శిక్షణ ఇస్తున్నారట. లోకేష్ రోజువారీ రాజకీయ వ్యవహారాలపై ఎలా ప్రవర్తించాలి.. మాట్లాడాలనే దానిపై హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం లోకేష్ కు రాజకీయాల్లో లైవ్ లో ఎలా మాట్లాడాలి… విలేకరుల ప్రశ్నలకు ఎంత వేగంగా… ఎంత నేర్పుగా సమాధానం ఇవ్వాలనే దానిపై పాఠాలు చెబుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో త్వరలోనే మన లోకేష్ బాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీడియాను, ప్రజలను ఎదుర్కోబోతున్నాడన్న మాట.. లైవ్ లో మాట్లాడించి కొడుకు ప్రతిభను ప్రపంచానికి చాటాలనుకుంటున్న చంద్రబాబు ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతం అవుతాయి.. లేక లోకేష్ బాబు తన భాషా లోపాన్ని కంటిన్యూ చేస్తాడా అన్నది వేచిచూడాలి.