డబ్బున్న వారి తరపునే పోలీసులు పనిచేస్తున్నారు – వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అకాడమీ వల్ల లాభం లేదని.. డబ్బు మాత్రం వృథా అని వ్యాఖ్యానించారు. జాతీయ పోలీస్ అకాడమీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. పోలీసుల ప్రవర్తన కూడా సరిగా ఉండడం లేదని ఆవేదన చెందారు. ట్రైనింగ్ తీసుకుని పోలీసులు మంచి పేరు తేవడం లేదన్నారు.

పనికిరాని వాళ్లుగా భావిస్తున్న వారిని, తుక్కుగా మిగిలిన వాళ్లను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అకాడమీలో నియమిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వారు పోలీసుకు ఎలాంటి శిక్షణ ఇస్తారని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి వల్ల డబ్బు అంతా వృథా అవుతోందన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు.

దేశంలోనే అత్యున్నత శిక్షణా సంస్థగా తెలంగాణ పోలీస్ అకాడమీని తాను తీర్చిదిద్దుతానని వీకే సింగ్ ప్రకటించారు. పోలీసు శిక్షణా సంస్థలు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జైలులో మగ్గుతున్న వారిలో 90 శాతం మంది పేదవారే ఉన్నారని వివరించారు. అలాంటి వారిలో చాలా మందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో కూడా తెలియదన్నారు. డబ్బున్న వారి తరపునే పోలీసులు పనిచేస్తున్నారని వీకే సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.