18 కెమెరాలతో షూట్‌… మోడీ లైవ్ ఇవ్వలేదని అధికారిణిపై వేటు

ప్రధాని మోడీ ప్రచారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలుసు. కెమెరాలకు ఎవరైనా అడ్డు వచ్చినా సహించరు. అలా అడ్డువచ్చిన తన భద్రతా సిబ్బందికి ఆయన క్లాస్‌ పీకిన ఉదంతాలున్నాయి. కెమెరాపై మోడీకి ఉన్న పట్టు అమోఘం. ఆయన ప్రచార పర్వాన్ని పర్యవేక్షించేందుకు బృందాలు కూడా పనిచేస్తుంటాయి. అయితే ప్రధాని కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వకుండా లైట్‌ తీసుకున్నందుకు దూరదర్శన్‌కు చెందిన ఒక అధికారిణి ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యారు.

సెప్టెంబర్ 30న చెన్నైలోని ఐఐటీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగాన్ని దూరదర్శన్‌లో లైవ్ ఇవ్వలేదని మోడీ అభిమానుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దక్షిణాదిపై హిందీని రుద్దేందుకు ఇటీవల ప్రయత్నాలు జరగడం… ఆ ప్రయత్నాలకు తమిళనాడు నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో తమిళ భాషపై ప్రశంసలు కురిపించారు.

అత్యంత ప్రాచీన భాష తమిళమని, తమిళుల ఆతిథ్యం చాలా ప్రత్యేకమని మోడీ ప్రసంగించారు. ఈ ప్రసంగాన్ని చెన్నై డీడీ లైవ్ ఇవ్వలేదని ఫిర్యాదు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు … ఇందుకు బాధ్యులను చేస్తూ చెన్నై దూరదర్శన్ కేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్‌ ఆర్. వసుమతిని సస్పెండ్ చేశారు.

అయితే సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో వేటుకు కారణాన్ని మాత్రం వివరించలేదు. ప్రధాని లైవ్‌ ఇవ్వనందుకే వేటు వేసినట్టు అధికారికంగా ప్రకటిస్తే అది వివాదానికి దారి తీయవచ్చన్న ఉద్దేశంతో ఇలా చేశారని భావిస్తున్నారు.

మోడీ కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వకపోయినప్పటికీ వివిధ యాంగిల్స్‌లో షూట్ చేసేందుకు ఏకంగా 18 కెమెరాలను డీడీ సిబ్బంది ఉపయోగించారు.