నిర్మాత బండ్ల గణేష్ పై కేసు

సినీ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దాడి చేసిన కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వర ప్రసాద్… పీవీపీపై తన అనుచరులతో కలిసి దాడి చేసారు. దీంతో పీవీపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ఇవ్వాల్సిన బకాయిలను అడిగినందుకు ఆగ్రహించిన బండ్ల గణేష్ తనపై అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారని పీవీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో బండ్ల గణేష్ పై పోలీసులు 506 రెడ్ విత్, 420, 448, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. పారిశ్రామిక వేత్త, నిర్మాత కూడా అయిన పీవీపీకి మరో నిర్మాత బండ్ల గణేష్ కు మధ్య చాలాకాలంగా వ్యాపార లావాదేవీలున్నాయి. ఈ వ్యాపార వ్యవహారాల్లో గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం నెలకొంది.

దీనిపై ఇరు పక్షాలు సినీ పెద్దలతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తల వద్ద కూడా వివాద పరిష్కారం కోసం ప్రయత్నించారు. అయితే, ఈ వివాదం పరిష్కారం కాకపోగా నిర్మాత బండ్ల గణేష్ బెదిరింపులకు పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు తనకు రావాల్సిన బకాయిలపై పారిశ్రామికవేత్త పీవీపీ నిర్మాత బండ్ల గణేష్ పై ఒత్తిడి పెంచారు.

దీంతో ఆగ్రహించిన బండ్ల గణేష్ తన అనుచరులతో దాడి చేశారని చెబుతున్నారు. ఈ మేరకు బండ్ల గణేష్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు పీవీపీ.