అశ్విన్ అంటే అంత అలుసా?

  • కొహ్లీ, శాస్త్రిలపై గవాస్కర్ గరంగరం
  • అశ్విన్ కు తగిన గౌరవం ఇవ్వాలంటూ చురక

టెస్ట్ క్రికెట్లో భారత్ ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలవడంలో ప్రధానపాత్ర వహించిన ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంటే… భారత టీమ్ మేనేజ్ మెంట్ కు ఎందుకంత అలుసని… మాజీ కెప్టెన్, సీనియర్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ నిలదీశారు. చీఫ్ కోచ్ రవి శాస్త్రి, కెప్టెన్ విరాట్ కొహ్లీలకు చురకలు అంటించారు.

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్ మూడోరోజు ఆటలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత స్టార్ బౌలర్ గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో 350 వికెట్ల మైలురాయికి కేవలం మూడు వికెట్ల దూరంలో మాత్రమే నిలిచిన అశ్విన్ ను గవాస్కర్ ప్రశంసలతో ముంచెత్తారు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 66 టెస్టులు ఆడిన అశ్విన్ కు 27సార్లు 5 వికెట్లు సాధించిన ఘనత ఉంది. మొత్తం 247 వికెట్లు పడగొట్టడంతో పాటు… బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 2 వేల 361 పరుగులు సాధించిన రికార్డు అశ్విన్ కు మాత్రమే సొంతం.

2017 తర్వాత టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కు ఇదే మొదటిసారి.

విండీస్ సిరీస్ లో చోటు లేని అశ్విన్…

భారత టెస్ట్ జట్టు నెంబర్ వన్ స్పిన్నర్ గా ఉన్న అశ్విన్ ను పక్కన పెట్టి…రవీంద్ర జడేజాను తుదిజట్టులోకి తీసుకోడాన్ని గవాస్కర్ తప్పు పట్టారు.

విండీస్ లాంటి అనామక జట్టుపై వ్యూహం పేరుతో అశ్విన్ ను డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం చేయడం ఏమాత్రం సమర్ధనీయం కాదని… అశ్విన్ లాంటి అసాధారణ , తెలివైన, బహుముఖ ప్రతిభ ఉన్న ఆటగాడిని ఎంత గౌరవంగా ,జాగ్రత్తగా చూసుకోవాలో టీమ్ మేనేజ్ మెంట్ గ్రహించాలని సూచించారు.

విదేశీ సిరీస్ ల్లో అశ్విన్ కు వికెట్లు పడకపోతే అది అతని తప్పుకాదని…ఆస్ట్ర్రేలియా గడ్డపై ఆడిన సమయంలో కంగారూ ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ తోనూ, ఇంగ్లండ్ గడ్డపై ఆడిన సమయంలో మోయిన్ అలీతోనూ అశ్విన్ ను పోల్చిచూడటంలో అర్థం లేదని…ఆ ఇద్దరు స్పిన్నర్లు భారత బ్యాట్స్ మన్ కు బౌలింగ్ చేసిన వాస్తవాన్ని గుర్తించాలని చెప్పారు.

ఇక ముందు జరిగే టెస్టు సిరీస్ తుదిజట్లలో అశ్విన్ కు చోటు ఉండితీరేలా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.