Telugu Global
NEWS

కోటి ప్రచారం శృతి మించడం వల్లే ఫిర్యాదు చేశాం...

సోషల్‌ మీడియాలో నెటిజన్లు పెట్టే బూతు పోస్టులపై గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ బూతు పోస్టులను చదివి వినిపించిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు అదే సమయంలో తమ నెటిజన్లను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాకు చెందిన కోటి అనే టీడీపీ వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టడమే కాకుండా ఆ కొడుతున్న దృశ్యాలను వీడియో కాల్‌ ద్వారా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి చూపించడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన […]

కోటి ప్రచారం శృతి మించడం వల్లే ఫిర్యాదు చేశాం...
X

సోషల్‌ మీడియాలో నెటిజన్లు పెట్టే బూతు పోస్టులపై గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ బూతు పోస్టులను చదివి వినిపించిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు అదే సమయంలో తమ నెటిజన్లను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాకు చెందిన కోటి అనే టీడీపీ వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టడమే కాకుండా ఆ కొడుతున్న దృశ్యాలను వీడియో కాల్‌ ద్వారా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి చూపించడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే రజనీ ఘాటుగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను చంద్రబాబు గానీ, ప్రత్తిపాటి పుల్లారావు గానీ నిరూపించాలని ఆమె సవాల్ చేశారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని… నిరూపించలేని పక్షంలో చంద్రబాబు, పుల్లారావు ఏం చేస్తారో చెప్పాలన్నారు.

ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడైన కోటి చాలా కాలంగా తనకు, తన కుటుంబసభ్యులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె చెప్పారు. బీసీ మహిళ అయిన తన చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక పుల్లారావు … కోటి లాంటి వ్యక్తులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కోటి వ్యవహారం శృతి మించిపోవడంతో వైసీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె వివరించారు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త కోటి పెట్టిన అనుచిత పోస్టులను ఆమె మీడియాకు చూపించారు.

ఒక మహిళా ఎమ్మెల్యేను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తికి చంద్రబాబు అండగా నిలవడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి చంద్రబాబా మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. మహిళలను గౌరవించడంలో చంద్రబాబుకు, జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. గుంటూరు జిల్లాలోనే ముగ్గురు మహిళలకు జగన్‌ మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చారని… చంద్రబాబు ఒక్క మహిళకైనా ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆమె నిలదీశారు.

First Published:  4 Oct 2019 8:00 PM GMT
Next Story