జగన్‌ ఆదేశంతో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఉదయమే ఆయన్న అరెస్ట్ చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోటంరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తన అనుచరుడి వెంచర్‌కు నీటి పైప్‌లైన్ వేయలేదన్న కోపంతో కోటంరెడ్డి తన ఇంటికి వచ్చి రభస చేశారని, బెదిరించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే పోలీసులు భారీగా ఆయన ఇంటి వద్ద మోహరంచారు. అనంతరం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

కోటంరెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఈ ఘటనపై ఆరా తీశారు. డీజీపీ సవాంగ్… సీఎంకు నివేదిక ఇచ్చారు. దాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చట్టప్రకారం ముందుకెళ్లాలని ఆదేశించారు.

చట్టం అందరికీ సమానంగానే వర్తిస్తుందని… చట్ట ప్రకారం కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అరెస్ట్‌ చేయాల్సి వస్తే చేయాల్సిందిగా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.