మహేష్ పారితోషికం ఎంత?

చాలామంది బడా హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోవడం ఎప్పుడో మానేశారు. కొంతమంది లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. మరికొందరు ఏరియా రైట్స్ తీసుకుంటున్నారు. ఇంకొందరు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తీసుకుంటున్నారు. ఇలా రెగ్యులర్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగానే హీరోలకు గిట్టుబాటు అవుతోంది. తాజాగా మహేష్ రెమ్యూనిరేషన్ పై కూడా ఇలాంటిదే ఓ గాసిప్ వచ్చింది. ఎట్టకేలకు దీనిపై నిర్మాత అనీల్ సుంకర స్పందించాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు మహేష్ బాబు 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడని, అది కూడా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కింద ఆ మొత్తం రాయించుకున్నాడని ఓ పుకారు ఆమధ్య వచ్చింది. దీనిపై స్పందించిన అనీల్ సుంకర, అలాంటిదేం లేదని స్పష్టంచేశాడు. ఇప్పటివరకు మహేష్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటున్నాడు అనీల్.

సరిలేరు నీకెవ్వరు సినిమా 75శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు మహేష్ కు ఎమౌంట్ ఇవ్వలేదంటున్నాడు అనీల్ సుంకర. సినిమాకు తను నిర్మాతనే అయినప్పటికీ.. దిల్ రాజు, మహేష్ కూడా భాగస్వాములుగా ఉన్నారని, కాబట్టి రిలీజైన తర్వాత ఆ లెక్కలు చూసుకుంటామని పరోక్షంగా వెల్లడించాడు. మొత్తమ్మీద మహేష్ ఈ సినిమాకు పారితోషికం తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఆ విషయాన్ని నిర్మాత స్వయంగా బయటపెట్టినట్టయింది.