జగన్‌ను ఫాలో అయిన యోగి ఆదిత్యనాథ్‌… పీపీఏలు రద్దు

25 ఏళ్ల పాటు అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసుకునేలా చంద్రబాబు తనకు అనుకూలమైన కంపెనీలతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను పునర్ పరిశీలన చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చెప్పగానే గగ్గోలు పెట్టారు చాలా మంది. ఆ చాలా మందితో చంద్రబాబుతో పాటు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ కూడా ఉన్నారు. పీపీఏల జోలికి వెళ్లవద్దంటూ పదేపదే కేంద్రమంత్రి ఆర్‌కేసింగ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు.

పీపీఏలను రద్దు చేస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారని, పెట్టుబడులు రావు అని అభ్యంతరం తెలిపారు. ఇక తనకు అనుకూలమైన విద్యుత్ సంస్థలకు ఇబ్బంది వస్తుండడంతో చంద్రబాబు, ఆయన మీడియా నిత్యం పీపీఏల రాగం ఆలపిస్తూ వచ్చింది. దేశంలో ఒక్క జగన్ తప్ప ఎవరూ ఇలా చేయడం లేదని వాపోయింది.

అయితే కేంద్రమంత్రి ఆర్‌కేసింగ్‌కు, చంద్రబాబుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్ద షాక్ ఇచ్చారు. యూపీలో ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో సౌర, పవన విద్యుత్‌ విషయంలో చేసుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేశారు. పీపీఏలను రద్దు చేస్తున్నట్టు సదరు కంపెనీలకు కనీస ముందస్తు సమాచారం కూడా యోగి సర్కార్ ఇవ్వలేదు.

2017లో 650 మెగావాట్ల సంప్రాదాయేత విద్యుత్‌ కోసం యూపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అయితే ఇప్పుడు తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుండడంతో గత ఒప్పందాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. మూడు రోజుల క్రితం నుంచి విద్యుత్‌ను సదరు కంపెనీల నుంచి తీసుకోవడం కూడా మానేసింది.

2017లో యూనిట్‌కు 3.46 రూపాయలతో యూపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పుడు యూనిట్‌ విద్యుత్‌ను 3.02 రూపాయలకే అందజేస్తామని ఎన్‌టీపీసీ ముందుకొచ్చింది. దాంతో పాత పీపీఏలకు యోగి సర్కార్ మంగళం పాడేసింది.

జగన్‌ మోహన్ రెడ్డి పీపీఏలను సమీక్షిస్తామనగానే పదేపదే లేఖలు రాసిన కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్… యూపీలో ఏకంగా విద్యుత్ ఒప్పందాలను ఆ ప్రభుత్వం రద్దు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదు.

ఏపీలో బాబు మీడియా కూడా ఆ అంశాన్ని ఎక్కడా ప్రచారం చేయడం లేదు. ఇక వైసీపీ మీడియా విభాగం సంగతి తెలిసిందే.