మళ్లీ రేసుగుర్రం బాటలో సైరా దర్శకుడు

సైరా నరసింహారెడ్డి థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు రెండేళ్లుగా ఆ సినిమా పని మీద బిజీగా గడిపిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక్కసారిగా ఖాళీ అయిపోయాడు. మరి ఇతడి నెక్ట్స్ సినిమా ఏంటి? సైరా లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసిన తర్వాత సురేందర్ రెడ్డి మళ్లీ రెగ్యులర్ సినిమా చేయగలడా? అతడి మనసు ఒప్పుకుంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసింది.

సైరా తర్వాత మరోసారి తన పాత పద్ధతిలోకి వెళ్లిపోయాడు సురేందర్ రెడ్డి. కిక్, రేసుగుర్రం టైపులో కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ తో ఓ కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమాతో తనకెంతో ఇష్టమైన జానర్ లోకి మళ్లీ వెళ్లబోతున్నానంటూ రీసెంట్ గా ప్రకటించాడు ఈ దర్శకుడు.

ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? సురేందర్ రెడ్డి నెక్ట్ సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నారు. ఈ మేరకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెరవెనక పావులు కదుపుతున్నారు. సురేందర్ రెడ్డికి అడ్వాన్స్ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. నిజానికి సురేందర్ రెడ్డికి మెగా కాంపౌండ్ లోనే మరో హీరోతో సినిమా చేయాలని ఉంది. కుదిరితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నాడు. కానీ బన్నీ ఇప్పుడు ఫుల్ బిజీ. అటు చరణ్ కూడా బిజీగా ఉండడంతో కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేశాడు.

పైగా ఇప్పటికే మెగా కాంపౌండ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు సురేందర్ రెడ్డి. ఇలాంటి టైమ్ లో మళ్లీ మరో మెగా హీరోతో సినిమా చేస్తే అతడిపై కాంపౌండ్ ముద్ర పడుతుంది. అందుకే సురేందర్ రెడ్డి బయటకు వచ్చాడు. ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడు. త్వరలోనే హీరో ఎవరనేది తేలిపోతుంది. అది నితినే అనేది తాజా టాక్.